రద్దు దిశగా తమిళనాడు సర్కారు: ఆరుగురు మంత్రులకు సమన్లు, సీఎంతో సహ!
చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు, క్వారీలపై గత శుక్రవారం ఆదాయ పన్ను శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల వేడి చల్లారక ముందే మంత్రి విజయభాస్కర్ కు ఐటీ శాఖ అధికారులు మళ్లీ చుక్కలు చూపిస్తున్నారు.
తమిళనాడులోని పుదుక్కోట్టలోని మంత్రి విజయభాస్కర్ క్వారీల్లో మరోసారి తనిఖీలు సాగుతున్నాయి. తిరువేంగవాసల్ లో మంత్రి విజయభాస్కర్ కు చెందిన క్వారీలపై పీడబ్ల్యూడీ (ప్రజాపనుల శాఖ) అధికారుల సహాయంతో ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.

150 ఎకరాల్లో క్వారీలు
మంత్రి విజయభాస్కర్ కు చెందిన 150 ఎకరాల్లోని క్వారీల్లో పది మంది అధికారులు ప్రవేశించి అక్కడి నిర్వహణ తీరుపై విచారణ చేపట్టారు. క్వారీల హద్దులను అధిగమించి నిక్షేపాలను కొల్లగొట్టినట్లు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఆ మంత్రి సామాన్యుడు కాదు
మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద గత శుక్రవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగానే ఆయన నిర్వహిస్తున్న క్వారీల్లో మళ్లీ ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని సమాచారం.

ఆరు మంది మంత్రులకు సమన్లు
తమిళనాడుకు చెందిన మరో ఆరుగురు మంత్రులకు ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. తమిళనాడు మంత్రులు ఎస్ పీ వేలుమణి రూ. 15 కోట్లు, దిండుగల్లు శ్రీనివాస్ రూ. 13 కోట్లు, తంగమణి రూ. 12 కోట్లు, సెంగోట్టయ్యన్ రూ. 13 కోట్లు, జయకుమార్ రూ. 11 కోట్లు, సెల్లూరు రాజా రూ. 48 లక్షలు ఆర్ కే నగర్ ఓటర్లకు పంచిపెట్టినట్లు ఐటీ దాడుల్లో ఆధారాలు లభ్యం కావడంతో సమన్లు పంపామని, ఆరు మంది మంత్రులను త్వరలో విచారించనున్నామని ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు.

విజయభాస్కర్ అరెస్టు తప్పదా ?
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇల్లు, ఆయన అనుచరుల ఇళ్లపై దాడి చేసిన ఐటీ శాఖ అధికారులు రూ. 5.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. మంత్రి బంధువులు, చెన్నైలోని ప్యారీస్ ప్రాంతంలో ఉన్న లాడ్జ్ లో ఆయన అనుచరులు ఉన్న గదిలో సోదాలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

రద్దు దిశగా ఎడప్పాడి ప్రభుత్వం
ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను అవినీతిమయం చేసిన తమిళనాడు ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు రూ. 89 కోట్ల నగదు, బహుమతులు బట్వాడా సాగినట్లు ఐటీ శాఖ అధికారులు సాక్షాలు సంపాధించారు.

ఆయన మొత్తం చెప్పేశారంట !
మంత్రి విజయభాస్కర్ ను సుమారు ఏడు గంటల పాటు విచారించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు పలు ఆసక్తికరమైన వివరాలు సేకరించారని సమాచారం. ఆర్ కే నగర్ లో నగదు పంపిణిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, మరో ఆరుగురు మంత్రులు ప్రధాన పాత్ర పోషించిన విషయం తెటతెల్లం అయ్యింది.

సీఎం, మంత్రులను విచారించాలని
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామితో సహ ఆరుగురు మంత్రులను విచారించాలని ఆదాయ పన్నుశాఖ అధికారులు నిర్ణయించుకున్నారని సమాచారం. సీఎంను విచారించే విషయంపై న్యాయనిపుణులతో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇదే జరిగితే తమిళనాడులో శశికళ వర్గంలోని ప్రభుత్వం కుప్పకూలిపోతుందని సమాచారం.












Click it and Unblock the Notifications