విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విశాఖ మన్యం

నగరాలు, పట్టణాలు ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక హంగులు సంతరించుకుంటున్నాయి. గ్రామాలలో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. కానీ, ఏజెన్సీ ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ ఎప్పట్లాగే కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదు.

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటుతున్నప్పటికీ ఇంకా "మాకు విద్యుత్ ఇవ్వండి, మా గ్రామాలకు కనీసం మట్టిరోడ్డైనా కల్పించడి" అని అంటూ ఏజెన్సీలోని గిరిజనులు మాత్రం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

11 మండలాల్లో విస్తరించి ఉన్న విశాఖ మన్యంలో కనీస సౌకర్యాలు లేని గ్రామాలు చాలా ఉన్నాయి.

ఏజెన్సీలోని కరెంట్ దీపం చూడని దాయర్తి గ్రామం, రోడ్డు అంటే ఎలా ఉంటుందో తెలియని పినకోట, పెదకోట, కివర్ల పంచాయితీల్లోని పదుల సంఖ్యలోని గ్రామాల దుస్థితిపై బీబీసీ ప్రత్యేక కథనాలు రాసింది. ఇక్కడి ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.

దాంతో, అధికారులు స్పందించారు, యంత్రాంగం కదిలింది. ఆ గ్రామాలకు విద్యుత్, రోడ్డు సౌకర్యం కూడా కల్పించారు. ఈ రెండు విజయాల్లోనూ గిరిజనుల పోరాటాలతో పాటు శ్రమదానం కూడా ఉంది.

సొంతంగా రోడ్డు వేసుకుంటున్న గిరిజనులు

అసలేం జరిగింది?

ఫిబ్రవరి 2020లో...విశాఖ ఏజెన్సీ, అనంతగిరి మండలంలో పినకోట, పెదకోట, కివర్ల పంచాయితీలోని దాదాపు 25 గ్రామాల ప్రజలు స్వయంగా రోడ్డును నిర్మించుకుంటున్నారనే వార్త బయటకు వచ్చింది.

కత్తి, సుత్తి, పార, పలుగు పట్టి...కొండల్ని, బండల్ని పిండి చేసి...గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి ఒకరో ఇద్దరో వచ్చి, శ్రమదానం చేసి రోడ్డును తవ్వడం ప్రారంభించారు.

ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి, తిరిగి విసిగిపోయిన గిరిజనం తమకు తామే రంగంలోకి దిగి, 14 కిలోమీటర్ల మట్టి రోడ్డు నిర్మాణం ప్రారంభించారు.

ఆ విషయం తెలుసుకున్న బీబీసీ ఆ ప్రాంతానికి వెళ్లి గిరిజనుల శ్రమను, అధికారుల అలసత్వాన్ని చూపించింది.

దాంతో స్పందించిన అధికారులు రోడ్డు నిర్మాణం చేసుకున్న గిరిజనుల శ్రమదానాన్ని ఉపాధి హామీ పధకంలో చూపించి, వారికి కూలీ డబ్బులను అందచేస్తామని చెప్పడంతో పాటు మిగతా రోడ్డు నిర్మాణాన్ని తామే చేపడతామని గిరిజనులకు హామీ ఇచ్చారు.

సొంతంగా రోడ్డు వేసుకుంటున్న గిరిజనులు

గిరిజనల శ్రమ వృధా అవుతున్న వేళ...

అయితే ఉపాధి హామీ డబ్బులు ఇచ్చినా, మిగతా రోడ్డుని పూర్తి చేస్తామని అధికారులు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు.

కొన్ని రోజులకు గిరిజనులు శ్రమదానంతో అప్పటీ వరకు నిర్మించుకున్న 8 కిలోమీటర్ల రోడ్డు సైతం పాడైపోవడం మొదలైంది.

చెట్లు, పొదలు పెరిగిపోయి, మలుపుల వద్ద మట్టి కిందకు జారిపోతుండేది. దీంతో శ్రమదానంతో తాము నిర్మించుకున్న రోడ్డు పాడైపోతుందని, అధికారులు త్వరగా స్పందించకపోతే తమ గ్రామాల్లో రోడ్డుని తమ జీవితకాలంలో చూడలేమంటూ ఆవేదన చెందారు.

గిరిజనుల శ్రమదానం వృథా అవుతుందంటూ బీబీసీ డిసెంబర్ 2020లో కథనాలు ప్రసారం చేసింది.

అధికారులకు వారి వ్యధను వినిపించింది, చూపించింది. దానికి స్పందించిన అప్పటి పాడేరు ఐటీడివో పీవో ఎస్. వెంకటేశ్వర్ నిధుల కొరత ఉందని, మరో ఐదు నెలల్లో తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించి రోడ్డుని పూర్తి చేస్తామని బీబీసీతో చెప్పారు.

మన్యానికి రహదారి

మాకు రోడ్డు లేదు...లైట్లు ఎలగవు

అదే సమయంలో అనంతగిరి మండలంలోని మరో మారుమూల గిరిజన గ్రామం దాయర్తిలోని గిరిజనుల వ్యధ బీబీసీ దృష్టికి వచ్చింది.

మా గ్రామానికి రోడ్డే కాదు, విద్యుత్ కూడా లేదంటూ అక్కడ గిరిజనుల చెప్పారు.

రోడ్డులేకపోవడంతో తమ తాతముత్తాల నుంచి రాకపోకలకు గుర్రాలను వాడతామని, రాత్రైతే దీపాలు లేక చీకట్లోనే ఉంటామని చెప్పారు.

ఈ కొండల్లో సెల్ ఫోన్ సిగ్నల్ ఉన్నా కూడా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు విద్యుత్ లేదని చెప్పారు. ఛార్జింగ్ కోసం 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం దేవరాపల్లికి వెళ్తున్నామన్నారు.

అదే సమయంలో పినికోట, పెదకోట, కివర్ల పంచాయతీ గ్రామ ప్రజలు శ్రమదానంతో నిర్మించుకుంటున్న రోడ్డు విషయం తెలిసి, దాయర్తి గ్రామ ప్రజలు కూడా శ్రమదానంతో రోడ్డు నిర్మించుకోవడం ప్రారంభించారు.

దాయర్తి గ్రామ దుస్థితిని కూడా మొట్టమొదటిసారిగా బీబీసీ తమ కథనాల ద్వారా చూపించింది. దీనిపై స్పందించిన ఐటీడీఏ అధికారులు, రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని బీబీసీతో చెప్పారు.

చివరకు గ్రామాలకు విద్యుత్ సౌకర్యం

2020 ఫిబ్రవరి నుంచి 2021 జూలై...

రోడ్డు, విద్యుత్ కోసం విశాఖ ఏజెన్సీలోని మారుమూల గిరిజనుల పోరాటాన్ని పలు దశల్లో ప్రచురించడం, ప్రసారం చేయడం...వారి కష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం బీబీసీ చేస్తూనే ఉంది.

ఏడాదిన్నర పాటు గిరిజనం కూడా పట్టువదలకుండా తమ సమస్యలని పరిష్కరించాలంటూ పోరాటాలు, అందోళనలు చేస్తూనే ఉన్నారు.

ఎట్టకేలకు ఈ గ్రామాల ప్రజల గోడు అధికారులను కదిలించింది.

రోడ్డు పై ప్రయాణిస్తున్న యువకులు

రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన ఐటీడీఏ అధికారులకు గిరిజనులు బ్రహ్మరథం పట్టారు.

పినకోట, పెదకోట, కివర్ల పంచాయితీల ప్రజలు కోరుతున్నట్లు తారు రోడ్డుని కూడా త్వరలోనే వేస్తామని అధికారులు తెలిపారు. అలాగే దాయర్తికి విద్యుత్ సౌకర్యం కల్పించిన విధంగానే, విద్యుత్ లేని మిగతా గ్రామాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

కరెంటు వెలుగును చూసిన గ్రామాలు

గిరిజనుల సంబరం...

విద్యుత్, రోడ్డు సౌకర్యం రావడంతో ఆయా గ్రామాల ప్రజలు బీబీసీకి కృతజ్ఞతలు తెలిపారు. మొదట్నుంచి తమవెంట ఉండి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడంలో కృషి చేసిన బీబీసీకు ధన్యవాదాలు చెబుతూ, తమ గ్రామంలోని రోడ్డు, విద్యుత్ సౌకర్యాలను ఆనందంగా చూపించారు.

"మా గ్రామ దుస్థితిని మొట్టమొదటిసారిగా కెమెరాలో బంధించి, ప్రపంచానికి చూపించింది బీబీసీయే. ఆ తర్వాతే అధికారులు స్పందించారు. అందరి వలన మాకు విద్యుత్ సౌకర్యం వచ్చింది. రోడ్డు కూడా త్వరలోనే పూర్తవుతుందని నమ్మకం ఉంది. ఇక నుంచి సెల్ ఫోన్ ఛార్జీంగ్ కోసం 22 కిలోమీటర్లు వెళ్లవలసిన పరిస్థితి లేదు" అని దాయర్తి గ్రామానికి చెందిన రమేష్ బీబీసీతో చెప్పారు.

"మేం శ్రమదానంతో నిర్మించుకున్న రోడ్డు వృధా అవుతుందని భయపడ్డాం. కానీ ఆ దశలో కూడా బీబీసీ మా కష్టాన్ని అధికారులకు చూపించింది. ఏలాగైతేనేం మా గ్రామాలకు రోడ్డు వచ్చింది. దీంతో మా గ్రామాల వరకు చాలా కష్టాలు తీరినట్లే".

రోడ్డు వచ్చింది కాబట్టి కాలేజీకు సెలవుల సమయంలో సిటీలో ఉండకుండా మా ఊరు వచ్చేయవచ్చు. అలాగే మిగతా గిరిజన గ్రామాలకు కూడా రోడ్డు వస్తే బాగుంటుంది" అని విశాఖలో ఇంజనీరింగ్ చదువుతున్న వెంకటరావు బీబీసీతో చెప్పారు.

అధికారులు

అధికారుల ఆనందం...

విద్యుత్, రోడ్డు లేని గిరిజన గ్రామాల దుస్థితిపై బీబీసీ ప్రసారం చేసిన కథనాలు చూశానని, ఐటీడీవో పీవో రోణంకి గోపాలకృష్ణ బీబీసీతో చెప్పారు.

మారుమూలనున్న దాయర్తి గ్రామానికి విద్యుత్ పౌకర్యం కల్పించడం పెద్ద ఛాలెంజ్ అని, దానిని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు.

బీబీసీ కథనాలను చూస్తున్న అధికారులు

ఇక దాయర్తి, పినకోటతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మట్టి రోడ్లు వేసుకున్న వారికి బీటీ రోడ్లు త్వరలోనే వేస్తామన్నారు. అలాగే రోడ్డు పనులకు గాను ఉపాధి హామీపధకం కింద కూలీని గిరిజనులకు చెల్లిస్తామని చెప్పారు.

రోడ్లు విషయంలో గిరిజనులు చూపిన స్ఫూర్తిని అభినందించారు.

"మౌలిక సదుపాయాల కల్పనతో గిరిజనుల జీవితాలు మెరుగవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మారుమూల గ్రామాలు కావడం, నిధుల కొరత వంటి సమస్యలతో కొంత ఆలస్యం జరిగినా, ఎట్టకేలకు ఈ సమస్యలు పరిష్కరించగలిగాం. ఈ సందర్భంగా గిరిజనుల్లో చూసిన సంతోషం, వారు చూసిన కృతజ్ఞత మరువలేనివి".

"విశాఖ ఏజెన్సీలో కొన్ని గ్రామాల్లో ఉన్న మౌళిక సౌకర్యాల సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తాం. భవిష్యత్తులో కూడా గిరిజనుల సమస్యలను బీబీసీ మా దృష్టికి తీసుకురావాలి." అని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Roads and electricity to tribal villages in Visakhapatnam Agency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X