ఆ కీలక స్థానం నుంచే పోటీ చేస్తానంటున్న రాబర్ట్ వాద్రా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) రాజకీయాల్లోకి రానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఆసక్తిక చూపడం గమనార్హం. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ(Amethi) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాబర్ట్ వాద్రా తెలిపారు.
'రాజకీయాల్లోకి రావాలని చాలా మంది నన్ను కోరుతున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి నాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే, ఒకవేళ నేను పోటీలోకి అడుగుపెడితే అమేథీని ఎంచుకుంటా. రాజకీయాల్లో నా మొదటి అడుగు అమేథీతోనే ఉండాలని భావిస్తున్నా. ఆ నియోజకవర్గ ప్రజుల కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారు' అని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు.

కాగా, అమేథీ నియోజకవర్గానికి సుదీర్ఘకాలంపాటు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ.. రాహుల్ గాంధీపై గెలుపొందారు. ఈసారి కూడా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. రాహుల్ గాంధీ వయానాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ పోటీని బీజేపీ ఖరారు చేయగా.. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు, రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టత రాలేదు. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications