రోజ్ వ్యాలీ స్కామ్: ఎంపీ బంద్యోపాధ్యాయ్‌ను అరెస్టు చేసిన సీబీఐ..
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మంగళవారం నాడు సీబీఐ ఎదుట హాజరయ్యారు.
కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ విచారణ నిమిత్తం మంగళవారం నాడు ఆయన సీబీఐ ఎదుట హాజరయ్యారు. విచారణ తర్వాత సీబీఐ ఆయన్ను కస్టడీలోకి తీసుకుంది. సీబీఐ విచారణకు ఆయన హాజరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కాగా, ఇదే కేసుకు సంబంధించి పార్టీ ఎంపీ తపాస్ పాల్ ను పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు బంద్యోపాధ్యాయ్ కు ఇదివరకే రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన మాత్రం సీబీఐ విచారణకు సహకరించలేదు.
గత సంవత్సరం డిసెంబర్ లో సీబీఐ ఆయనకు రెండుసార్లు పంపించగా.. పార్లమెంటరీ సెషన్స్ ను సాకుగా చూపి ఆయన విచారణకు హాజరవలేదు. స్కామ్ లొ 60వేల కోట్ల మేర సుదీప్ బంధ్యోపాధ్యాయ్ ప్రమేయం ఉన్నట్టుగా ఆయన మీద ఆరోపణలున్నాయి.

'నేను ఇదివరకే చెప్పాను.. నాకు వ్యతిరేకంగా ఏం జరిగిందో తెలుసుకోవడానికైనా సీబీఐ విచారణను ఎదుర్కొంటానని' అని బంద్యోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. తన మీద, పార్టీ మీద ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్ర అని ఆరోపించారు.
రోజ్ వ్యాలీ స్కామ్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ విచారించిన నేపథ్యంలో.. గతంలో వెలుగుచూసిన శారదా స్కామ్ కుంభకోణం(రూ.2460కోట్లు) కన్నా ఇది ఏడు రెట్లు పెద్ద కుంభకోణం అన్న సంగతి తేలింది.
రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ లో.. తమ సంస్థలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ మొత్తాలను తిరిగి చెల్లిస్తామని చెప్పి చాలామంది పేద-మధ్య తరగతి ప్రజల వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇలా దాదాపు 10రాష్ట్రాలకు చెందిన ప్రజల వద్దనుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.
రోజ్ వ్యాలీ సంస్థ రియల్ ఎస్టేట్, సినిమా, మీడియా, జ్యువెలరీ, హోటల్స్, రిసార్ట్స్.. ఇలా పలు రంగాల్లోకి విస్తరించింది. రోజ్ వ్యాలీ యజమాని గౌతమ్ కుందు, సంస్థకు చెందిన పలువురు అధికారులు గత ఏడాది నుంచి కటకటాల్లోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications