మోడీ గాలి మాటలు: సోనియాకి స్మృతి ఘాటు కౌంటర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు గుప్పించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మంగళవారం నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు.
నాశనం చేయడమే కాకుండా సరిచేయాలని చూస్తున్న ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నారన్నారు. లోకసభ ఎన్నికల్లో ప్రజలు ప్రధాని మోడీకి పట్టం కట్టారన్న విషయం కాంగ్రెస్ నేతలు గుర్తించాలన్నారు. ఇన్నాళ్లూ దేశ పరిస్థితి దిగజార్చి ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
ప్రధాని మోడీవి గాలి మాటలన్న సోనియాపై నిప్పులు చెరిగారు. సైనికులు డిమాండ్ చేస్తున్నట్లు ఓన్ ర్యాంక్ వన్ పెన్షన్ పైన సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు.
దీనిపై స్మృతి ఇరానీ స్పందిస్తూ... ఎవరైతే (కాంగ్రెస్) ఈ విషయంలో తమ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారో వారే గతంలో.. ఆర్థిక ఇబ్బందుల వల్ల దానిని అమలు చేయలేమని చెప్పారని, కానీ ప్రధాని మోడీ దానిని ఆచరణలో చేసి చూపిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.

బిజెపి ప్రభుత్వంపై సోనియా నిప్పులు
రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన ఉద్యమం మూలంగానే ప్రధాని నరేంద్ర మోడీ తోకముడిచి భూసేకరణ సవరణ బిల్లు ఉపసంహరించుకున్నారని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రారంభోపన్యాసం చేస్తూ రాహుల్‌పై ప్రశంసలు కురిపించారు. మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
భూసేకరణ సవరణ బిల్లు ద్వారా రైతులను నిలువునా దోపిడి చేసేందుకు మోడీ రంగం సిద్ధం చేస్తే, రాహుల్ నాయకత్వంలో పార్టీ నేతలు, శ్రేణులు దేశస్థాయిలో ఉద్యమించి ఎన్డీయే ప్రభుత్వం ఆటలకు అడ్డుకట్ట వేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీతోపాటు భావసారూప్యత కలిగిన పార్టీలు నిరంతరంగా నిర్వహించిన ఉద్యమం మూలంగానే భూసేకరణ సవరణ బిల్లు ఉపసంహరించుకున్నారన్నారు. కరవు, వరదల మూలంగా దేశంలోని రైతులు నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.
ప్రధాని మోడీ లోకసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలేవీ అమలు కావటం లేదన్నారు. ఆయన హామీలన్నీ గాలి మాటలుగా మిగిలిపోయాయన్నారు. ప్రచారం కోసం మోడీ హామీలిస్తారు తప్ప అమలు చేసేందుకు కాదనేది రుజువైందన్నారు.












Click it and Unblock the Notifications