మోడీ వీడియో హల్‌చల్: రాహుల్‍కు 3 రోజుల గడువు
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల తుది విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇచ్చిన వీడియో సందేశం సోమవారం మరో వివాదానికి తెరలేపినట్లయింది. బిజెపికి ఓట్లు వేయవలసిందిగా ఓటర్లను అభ్యర్థిస్తూ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి మోడీ ఈ వీడియోను విడుదల చేశారని, ఆయనపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం సహా 41 లోక్‌సభ స్థానాలకు సోమవారం తుది విడత పోలింగ్ జరుగున్న సమయంలో ఆయన ఈ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో అత్యంత విశిష్ట పుణ్యక్షేత్రమైన వారణాసిలో బిజెపికి ఓట్లు వేసి ‘గంగా-జముని తెహ్‌జీబ్'ల ఐక్యతను, సామరస్యతా స్ఫూర్తిని ప్రతిబింబించాలని మోడీ తన వీడియో సందేశంలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

షోకాజ్ నోటీసుపై రాహుల్‌కు మరో 3 రోజులు గడువు
షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ సోమవారం మరో మూడు రోజుల గడువు ఇచ్చింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే హింసాకాండలో వేలాది మంది మంది ప్రజలు హత్యకు గురవడం ఖాయమని వ్యాఖ్యానించినట్టు రాహుల్ గాంధీపై ఆరోపణలు రావడంతో ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
వాస్తవానికి రాహుల్ సోమవారం సాయంత్రం లోగా ఈ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే రాహుల్ చేసుకున్న విజ్ఞప్తి మేరకు ఎన్నికల కమిషన్ ఈ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు గడువును మే 15వ తేదీ వరకూ పొడిగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. బిజెపి అధికారంలోకి వస్తే దేశంలో హింసాకాండ చెలరేగి 22 వేల మంది ప్రజలు హత్యకు గురవుతారని మే 1వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పేర్కొన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బిజెపి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రాహుల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో మే 9వ తేదీన ఈసి ఆయనకు నోటీసు జారీ చేసింది.












Click it and Unblock the Notifications