
రూ.20 కోట్ల నగదు: గుట్టలుగా కరెన్సీ, స్కాం ఇదే.. ఎక్కడ అంటే.??
పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో రిక్రూట్ మెంట్ కుంభకోణం కలకలం రేపుతుంది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. అయితే గుట్టలుగా నగదు బయటపడింది. ఆ మొత్తం రూ.20 కోట్ల వరకు ఉంటుంది.
ఎస్ఎస్‌సీ ద్వారా టీచర్ల నియామకం చేపట్టే క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారి ఉంటాయి. ఈ మేరకు ఈడీ సోదాలు చేపట్టింది. పార్థ ఛటర్జీ నివాసంతోపాటు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారి నివాసంలో ఈడీ అధికారులు సోదా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మంత్రి సన్నిహితురాలి ఇంటి వద్ద భారీగా నగదు పట్టుబడింది.

అర్పిత ఇంట్లో పట్టుబడిన నగదు రూ.500, రూ.2 వేల నోట్లు కనిపించాయి. ఆ నగదు లెక్కించడానికి ఈడీ అధికారులు బ్యాంక్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. అర్పిత నివాసంలో దాదాపు 20 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్స్, రికార్డులు, కంపెనీలకు సంబంధించిన సమాచారం, ఎలక్ట్రానిక్ డివైజ్, విదేశీ కరెన్సీ, బంగారం కూడా రికవరీ చేశారు.మంత్రి పార్థ ఛటర్జీ, మరో మంత్రి పరేశ్ అధికారి నివాసంలో కూడా దాడులు చేశారు.

టీఎంసీ సర్కారుపై బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. డబ్బు, బిర్యానీ పంచి ప్రజలను సమీకరిస్తూ ప్రతిసారి మోసం చేయలేరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకే ఈడీ సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరి నివాసంలో సోదాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇది రూ.100 కోట్ల భారీ స్కాం అని దిలీప్ ఘోష్ వివరించారు.