కళ్లు బైర్లు కమ్మేలా-రూ.257 కోట్ల నగదు-250 కేజీల వెండి-25 కేజీల బంగారం-ఆ వ్యాపారి ఇంట్లో
ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ ప్రత్యర్ధులపై కేంద్ర దర్యాప్తు సంస్ధల దాడులు ఎక్కువవుతున్నాయి. ఇందులో భాగంగా సమాజ్ వాదీ పార్టీకి దగ్గరగా ఉండే కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ పై ఐటీ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ విభాగాలు దాడులకు దిగాయి. ఇందులో కళ్లు బైర్లు కమ్మేలా ఆస్తులు బయటపడుతున్నాయి.
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ పై నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటివరకూ రూ.257 కోట్ల నగదు, 250 కిలోల వెండి, 25 కిలోల బంగారం, 300 తాళాలు బయటపడినట్లు అధికారులు ప్రకటించారు. అధికారుల విచారణలో పీయూష్ జైన్ ఈ ఆస్తులు తన పూర్వీకుల బంగారం అమ్మడం వల్ల వచ్చాయని వెల్లడించారు. కాన్పూర్‌కు చెందిన వ్యాపారవేత్త పీయూష్ జైన్ పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదివారం రాత్రి అరెస్టయ్యాడు, ఇది ఇటీవలి కాలంలో అతిపెద్ద నగదు స్వాధీనం అని కేంద్ర దర్యాప్తు సంస్ధలు చెప్తున్నాయి.

నాలుగు రోజులుగా సాగుతున్న ఈ దాడుల్లో జైన్ కు చెందిన పలు ప్రదేశాల్లో ఇప్పటివరకు రూ. 257 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా, ఇ-వే బిల్లులు లేకుండా వస్తువులను రవాణా చేసే వ్యక్తి ద్వారా సరుకులను పంపే నెట్ వర్క్ ద్వారా ఈ వ్యవహారం బయటపడింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లోని యూనిట్ల నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. జైన్‌ని ఇవాళ కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ కోసం కాన్పూర్ నుంచి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ వ్యవహారం యూపీ ఎన్నికల ప్రచారం బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాల్ని కేంద్ర దర్యాప్తు సంస్ధలతో టార్గెట్ చేయించడం మామూలేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ మాత్రం వీటిని తప్పుబడుతోంది.












Click it and Unblock the Notifications