ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ 446.52 కోట్లు
దేశంలో అత్యంత శక్తిమంతమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్న నరేంద్ర మోదీ భద్రత కోసం ఇటీవలి కేంద్ర బడ్జెట్ లో రూ.600 కోట్లు కేటాయించడం తెలిసిందే. తాజాగా ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలు కూడా వెల్లడయ్యాయి. గడిచిన ఐదేళ్లలో ప్రధాని హోదాలో మోదీ చేపట్టిన ఫారిన్ టూర్లకు మొత్తంగా రూ 446.52 కోట్లు వెచ్చించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
Recommended Video

ప్రధాని ఫారిన్ టూర్ల ఖర్చు వివరాలపై ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ లోక్ సభలో బదులిచ్చారు. చార్టర్డ్ విమానాలతో కలుపుకొని మొత్తం రూ 446.52 కోట్లు ఖర్చయిందన్న మంత్రి, సంవత్సరాలవారీగా సమగ్ర లెక్కల్ని వెల్లడించారు. 2014లో మోదీ ప్రధాని పీఠమెక్కారు. తొలినాళ్లలో ఆయన చాలా దేశాలు చుట్టిరావడంతో 2015-16 విదేశీ టూర్ల ఖర్చు రూ 121.85 కోట్లుగా తేలింది.

ఆ తర్వాతి ఏడాది, అంటే, 2016-17లో రూ 78.52 కోట్లు, 2017-18లో రూ 99.90 కోట్లు కాగా, 2018-19లో రూ 100 కోట్లు ఖర్చయినట్లు విదేశాంగ శాక తెలిపింది. అయితే గతేడాది ఎన్నికల సందర్భంలో, ఆ తర్వాత కూడా ప్రధాని ఫారిన్ టూర్లను చాలా వరకు తగ్గించుకోవడంతో 2019-20 ఏడాదికిగానూ కేవలం రూ 46.43 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు తేలింది. మోదీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్ష పార్టీలు తరచూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఖర్చులపై క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
భద్రతకు సంబంధించి, ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కి 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ఏకంగా రూ.600 కోట్లు కేటాయించారు. మాజీ ప్రధానులకు, కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఎస్పీజీ భద్రత ఉపసంహరించిన తర్వాత ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే అత్యధికంగా 3 వేల మందితో కూడిన ఎస్పీజీ రక్షణ పొందుతున్నారు.












Click it and Unblock the Notifications