ముస్లీంలకి ఆరెస్సెస్ విందు, చైనాపై ఆర్గనైజర్ ఆగ్రహం
ఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) తొలిసారి ముస్లీంలకు ఇప్తార్ విందు ఇచ్చింది. పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ విందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లీంలతో పాటు, పలు దేశాల దౌత్యవేత్తలను కూడా ఆరెస్సెస్ ఆహ్వానించింది.
ప్రతి పౌరుడూ ఇతర మత విశ్వాసాలను గౌరవించాలని, మత సామరస్యాన్ని కలిగి ఉండాలని ఆరెస్సెస్ కార్యకర్త ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఖురాన్‌లోని కొన్ని వ్యాఖ్యలను ఉదహరించారు. మతాలు వేరు అయినా దేవుడు ఒక్కడే అన్నారు.
వివిధ ముస్లీం దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఈ విందుకు హాజరయ్యారు.

చైనాపై ఆరెస్సెస్ ధ్వజం
చైనా పైన ఆరెస్సెస్ నిప్పులు చెరిగింది. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ విషయంలో చైనా చర్యలు నేరాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ విస్తరణ పైన ఆందోళన వ్యక్తం చేసింది.సంబంధిత వ్యాఖ్యలతో ఆరెస్సెస్ అధికార పత్రిక ఆర్గనైజర్లో సంపాదకీయం వచ్చింది.
లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పాక్ పైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిని భారత్ కోరింది. తీర్మానానికి చైనా అడ్డుపడింది. చైనా చర్యలు నేరాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని ఆరెస్సెస్ రాసింది.












Click it and Unblock the Notifications