అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, ఇక..ఇరుముడితో విమానంలోకి అనుమతి..!!
అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు విమానాల ద్వారా వేళ్లే భక్తులు ఇక నుంచి ఇరుముడి సైతం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన చేసారు. శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములు తమతో పాటుగానే విమానాల్లో ఇరుముడి తీసుకెళ్లవచ్చని.. జనవరి 20వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసారు.
శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీపికబురు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళలోని శబరిమలకు మాలధారులు ఇరుముడితోనే విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. అయ్యప్ప భక్తుల వినతితో ఈ మేరకు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. అందుకు అనుగుణంగా పౌరవిమానయాన భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు.

ఈ మేరకు మంత్రి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. భద్రతా కారణాల రీత్యా విమానంలో కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని ఇన్నాళ్లూ అనుమతించలేదన్నారు. దీంతో స్వాములు రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. ఈ క్రమంలో అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి మేరకు నిబంధనలు సడలించామని, ఈ సౌలభ్యం మకరజ్యోతి దర్శనం ముగిసేవరకు(జనవరి 20) అందుబాటులో ఉంటుందని తెలిపారు.
తాజా ఉత్తర్వులతో ఎయిర్‌పోర్టు సిబ్బంది స్కానింగ్ చేసిన తర్వాత భక్తులు నేరుగా ఇరుముడితో విమానాల్లో ప్రయాణం చేయవచ్చని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేసారు. శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగ కుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
స్వామియే శరణం అయ్యప్ప!
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) November 28, 2025
శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి… pic.twitter.com/QT6JGV45Ng
మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని వివరించారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం, మరియు ఆత్మగౌరవం కల్పించడం ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయంగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications