ఢిల్లీలో కాంగ్రెస్ రెబెల్ సచిన్ పైలట్ -పార్టీని ధిక్కరించి చేసిన ధర్నాపై వివరణ..?
రాజస్తాన్ కాంగ్రెస్ లో రెబెల్ నేతగా పేరుతెచ్చుకుంటున్న యువనేత సచిన్ పైలట్.. నిన్న పార్టీ హెచ్చరికల్ని పట్టించుకోకుండా సొంత ప్రభుత్వంపైనే నిరసనకు దిగారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ధర్నాతో పార్టీ పరువు తీయొద్దని అధిష్టానం హెచ్చరించినా లెక్కచేయని పైలట్.. ఇవాళ దీనిపై వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ చేరుకున్నారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనతో పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించిన సచిన్ పైలట్.. ఇావాళ పార్టీ అధినాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. అయితే పైలట్ ఎవరిని కలవబోతున్నారనే దానిపై సమాచారం లేదు.అయితే పైలట్ అధిష్టానంలో కీలక నేతల్ని కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పైలట్ వివరణ తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతోందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

గతంలో బీజేపీ సీఎంగా ఉన్న వసుంధరా రాజేకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం అశోక్ గెహ్లాట్ పై ఒత్తిడి పెంచేందుకు పైలట్ చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్ష రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.కాంగ్రెస్ హెచ్చరికల్ని లెక్కచేయకుండా పైలట్ నిర్వహించిన ఈ దీక్షపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఇది కచ్చితంగా పార్టీ వ్యతిరేక చర్యేనని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ విషయంలో కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన పైలట్ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications