రేపు పుత్తంరాజు కండ్రిగకు సచిన్, భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్: క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఈరోజు, రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సచిన్ టెండూల్కర్ ఈరోజు ముంబై నుంచి చెన్నైకి విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5 గంటలకు కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంటారు.
రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం 8 గంటలకు హెలికాప్టర్ ద్వారా పుత్తంరాజు కండ్రిగకు చేరుకుంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ ఊర్లోనే సచిన్ గడపనున్నారు. చివరి పది నిమిషాలు గ్రామస్థులతో ఫోటోలు దిగనున్నారు.
సచిన్ టెండూల్కర్ గ్రామానికి రానున్న నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు. గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం గ్రామస్థులు మాత్రమే ఆయనను కలవాలని, సందర్శకులు, అభిమానులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్‌ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్‌సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద ఈ గ్రామాన్ని దత్తతతీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామాన్ని రూ. 3.50 కోట్ల నిధులతో అభివృద్ది చేయనున్నట్లు సచిన్ ప్రకటించారు.
ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు. నవంబర్ 16వ తేదీన సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని సందర్శించి అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పుత్తరాజుకండ్రిక గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్‌ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.












Click it and Unblock the Notifications