మిరాక్‌పై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమైన సహారా
న్యూఢిల్లీ: రుణం ఇప్పిస్తామంటూ నెలలు తరబడి తిప్పుకున్న అమెరికాకు చెందిన మిరాక కేపిటల్ గ్రూప్ చివరకు తమను మోసం చేసిందని సహారా ఇండియా గ్రూప్ గురువారం ఆవేదవ వ్యక్తం చేసింది. దీంతో సుబ్రతారాయ్ ఆదేశాలతో మిరాక్‌పై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టేందుకు సహారా ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... తక్కువ కాలంలో అధిక రాబడులిస్తామని చెప్పి, నిబంధనలను అతిక్రమించి ప్రజల వద్ద నుంచి పెద్ద సంఖ్యలో అక్రమంగా డిపాజిట్లు సేకరించింది సహారా ఇండియా. దీనిపై దృష్టి పెట్టిన మార్కెట రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ సహారా చీఫ్ సుబ్రతారాయ్‌పై కేసు నమోదు చేసింది.
ఆ తర్వాత ఈ కేసు విచారణలో సహారా చీఫ్ సుబ్రతారాయ్‌ని అరెస్టు చేసి తీహార్‌లోని సెంట్రల్ జైల్లో ఉంచారు. బెయిల్ కోసం సుబ్రతారాయ్ ప్రయత్నించగా, రూ. 10 వేల కోట్లు డిపాజిట్ చేస్తే బెయిల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో సహారా సుబ్రతారాయ్‌కు చెందిన లండన్‌లోని గ్రోవర్ హౌస్, న్యూయార్క్‌లోని హోటల్‌ను అమ్మకానికి ఉంచారు.

ఈ హోటళ్లను అమ్మిపెట్టి రెండు బిలియన్ డాలర్లు రుణమిప్పిస్తామని మిరాక్ గ్రూపు ముందుకొచ్చింది. వీటిని కొనేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని శారాన్ష్ శర్మ అనే పేరున్న మాజీ బ్రోకర్ సుబ్రతా రాయ్‌ని సంప్రదించాడు.
ఆ తరువాత బ్యాంకు ఆఫ్ అమెరికాలోని ఖాతాలో ఆయన బిలియన్ డాలర్లకు పైగా నగదు జమ చేశాడని సహారా కార్పొరేట్ ఫైనాన్సు విభాగం హెడ్ సందీప్ వాద్వా తెలిపారు. అయితే, తమ బ్యాంక్‌లో అటువంటి ఖాతా ఏమీ లేదని బ్యాంకు అఫ్ అమెరికా అధికారులు స్పష్టం చేయడంతో, ఆయనకు బెయిలు తెప్పించేందుకుఫోర్జరీ పత్రాలను వాడినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాకు చెందిన ఆ సంస్ధ ఇప్పుడు చేతులెత్తేసింది. దీంతో రుణమిప్పిస్తామని చెప్పి, ఫోర్జరీ పత్రాలు సమర్పించిన మిరాక్ గ్రూపుపై చర్యలూ తీసుకోవాలనే యోచనలో సహారా ఇండియా యాజమాన్యం ఉంది.
ఇక, డిపాజిట్‌దార్లను మోసం చేసిన కేసులో జైల్లో ఉన్న సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌కి బెయిల్ మంజూరు చేసేందుకు నిధుల కోసం అనుసరిస్తున్న కొత్త ప్రణాళికను తెలియజేయాల్సిందిగా సుప్రీం కోర్టు బుధవారం కోరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications