కలాం మనవడి విజ్ఞప్తి: రామేశ్వరంలోనే అంత్యక్రియలు
చెన్నై: షిల్లాంగ్‌లో కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం పార్థీవదేహాన్ని తమకు అప్పగించాలని ఆయన మనవడు ఎపిజెఎంకె షేక్ సలీం విజ్ఞప్తి చేశారు. కలామ్ మృతి వార్తను మీడియా ద్వారా తెలుసుకున్న రామేశ్వరం వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సమాచారం తెలియగానే హూటాహూటిన కలాం నివాసానికి చేరుకుని ఆయన సోదరుడు ఎపిజెఎం మరైక్కయ్యర్‌ను, ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఈ సందర్భంగా మరైక్కయ్యర్ కుమారుడు సలీం మీడియాతో మాట్లాడారు.

తమ తాతయ్య పార్థివ దేహాన్ని అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి సలీం విజ్ఞప్తి చేశారు. వివాహాన్ని సైతం పక్కనబెట్టి తనకిష్టమైన గ్రామాన్ని వదిలి జీవితాంతం దేశంకోసమే శ్రమించారని అన్నారు.
తమ తాత.. తన కుటుంబానికీ దూరంగానే గడిపారని కన్నీటి పర్యాంతమయ్యారు. అందువల్ల భౌతికకాయాన్ని తమకు అప్పగిస్తే ఆయనకిష్టమైన ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

రామేశ్వరంలోనే కలాం అంత్యక్రియలు
కలాం అంత్యక్రియలను ఆయన స్వగ్రామం రామేశ్వరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో కలాంకు ఇష్టమైన రామేశ్వరంలోనే ఆయన అంత్యక్రియలు జులై 30న జరగనున్నాయి.












Click it and Unblock the Notifications