సౌదీ ఎడారిలో కురుస్తున్న మంచు భారత్ కూ ప్రమాద సంకేతమేనా ? ఇవే సాక్ష్యాలు..!
వాతావరణ మార్పు అంటే కేవలం వేడి రోజులేనన్నది అపోహ. శాస్త్రవేత్తల ప్రకారం, ఇది తప్పు. భూమి వేడెక్కే కొద్దీ, వాతావరణం ఎక్కువ తేమ, శక్తిని నిలుపుకొని, స్దిరమైన వాతావరణ నమూనాలని అస్థిరంగా మారుస్తుంది.
సాధారణంగా మైదాన, కొండ ప్రాంతాల్లో కురిసే మంచు ఎడారిలో కురవడం ఓ అసాధారణ పరిణామమే. తాజాగా సౌదీ అరేబియా ఎడారిలో ఇలా కురుస్తున్న మంచుతో అక్కడి స్ధానికులు పండగ చేసుకుంటుండగా..అంతర్జాతీయంగా మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. భూగోళంపై వాతావరణ మార్పులకు ఇదో సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతే కాదు ఇది భారత్ కు కూడా ప్రమాద సంకేతాలను పంపుతోంది.
వాస్తవానికి సౌదీలో మంచుకురవడం చాలా అరుదు. ఈ శీతాకాలంలో సౌదీ ఉత్తర ప్రాంతాల్లో ఇలా మంచు కురవడం అసాధారణంగా, ఆందోళనకరంగా మారింది. తబూక్ సహా ఇతర పర్వతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి కొండలు తెల్లబడ్డాయి. చలి ప్రాంతాల తరహాలో ఇక్కడ వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంచుతో కప్పబడిన ఎడారి వీడియోలు, వాటి అందాలు వైరల్ అయ్యాయి. అయితే వాతావరణ మార్పు ఇక దూరపు ముప్పు కాదని, ప్రమాదానికి చాలా దగ్గర్లోనే ఉన్నామని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

వాతావరణ మార్పు అంటే కేవలం వేడి రోజులేనన్నది అపోహ. శాస్త్రవేత్తల ప్రకారం, ఇది తప్పు. భూమి వేడెక్కే కొద్దీ, వాతావరణం ఎక్కువ తేమ, శక్తిని నిలుపుకొని, స్దిరమైన వాతావరణ నమూనాలని అస్థిరంగా మారుస్తుంది. దీని వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వడగాడ్పులు, అధిక వర్షపాతం, ఊహించని చలి వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం భారతదేశం ఈ ఆందోళనకర ధోరణిని ప్రత్యక్షంగా అనుభవించింది.
భారత్ లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో రికార్డు వడగాడ్పులు వీచాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలో వినాశకర క్లౌడ్ బరస్ట్ లు జరిగాయి. ఆలస్యంగా, అస్తవ్యస్తంగా వచ్చిన రుతుపవనాలు కొన్నిచోట్ల ప్రాణాంతక వరదలకు కారణమయ్యాయి. ఇవన్నీ సాధారణ సంఘటనలు కావు. వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని ఇవి సంకేతాలు. భారతదేశానికి ఈ హెచ్చరిక కేవలం మంచు తుఫానుల గురించి కాదు, పర్యావరణ వ్యవస్థ పతనమవుతున్న ప్రమాదం గురించే. వ్యవసాయ చక్రాలు, నీటి నిర్వహణ, పట్టణ ప్రణాళిక, విద్యుత్ డిమాండ్ కాలానుగుణ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. అవి దెబ్బతిన్నప్పుడు, పంట నష్టాల నుండి పట్టణ వరదలు, వేడి సంబంధిత మరణాల వరకు నష్టాలు పెరుగుతాయి.

కాబట్టి వేడిని తట్టుకునే పట్టణ ప్రణాళిక, బలమైన ముందస్తు హెచ్చరికలు, వరదలను తట్టుకునే మౌలిక సదుపాయాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం వంటి చర్యలు తక్షణావసరంగా నిపుణులు సూచిస్తున్నారు. నష్ట నివారణ ముఖ్యమైనదే అయినా, అనుసరణ తప్పనిసరి. కాబట్టి వాతావరణ సంక్షోభం తలుపు తట్టడం లేదు, అది ఇప్పటికే లోపల ఉందనేది భారత్ నేర్చుకోవాల్సిన పాఠం. సౌదీ ఎడారిలో కురుస్తున్న మంచు తరహాలోనే భారత్ లో కూడా అసాధారణ వాతావరణ పరిస్ధితులు కనిపిస్తుండటం రాబోయే ముప్పుకు సంకేతంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications