ఆయన్ను పరమాత్మగా ప్రకటించండి-పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు- లక్ష జరిమానా..
భారత్ లో దివంగత మతగురువు శ్రీశ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్రను పరమాత్మగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్ధానం పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ కొట్టేయడమే కాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
దివంగత మత గురువు ఠాకూర్ అనుకుల్ చంద్రను పరమాత్మగా ప్రకటించాలని, అన్ని మతాలకూ ఆయన్ను గురువుగా గుర్తించాలని పిటిషనర్ ఉపేంద్ర నాథ్ దలై సుప్రీంకోర్టులో పిల్ వేశారు. దీనిపై న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. అయితే విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ దలై తన విజ్ఞప్తిని కోర్టులో చదవడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే న్యాయమూర్తులు దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపారు.

వినండి, మీ ఉపన్యాసం వినడానికి తాము ఇక్కడ లేమని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెలా (మతగురువు అనుకుల్ చంద్రను పరమాత్మగా ప్రకటించడం ) ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దేశంలో ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని, ఓ నిర్దిష్ట మతాన్ని అనుసరించమని తాము ప్రజలను ఎలా అడుగుతామని ప్రశ్నించారు.
మీకు కావాలంటే మీరు ఆయన్ను 'పరమాత్మ' (అత్యున్నతమైన వ్యక్తి)గా పరిగణించవచ్చని న్యాయమూర్తులు సూచించారు. అంతే కానీ ఇతరులపై ఎందుకు అమలు చేయాలని నిలదీశారు. భారతదేశం లౌకిక దేశమని, ప్రతి ఒక్కరికీ వారి మతంపై హక్కు ఉందని చెబుతూ పిటిషన్ ను తోసిపుచ్చారు. అంతేకాదు ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్ దాఖలు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. పిటిషనర్ దలై కు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications