జొరబడాలా, మా పని అదే?: టి పిటిషన్లపై సుప్రీం ఘాటు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. విభజనకు వ్యతిరేకంగా సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని కోర్టు తోసిపుచ్చింది. ఈ సమయంలో సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది.
విభజన అంశం పార్లమెంటు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని, గతంలో సీనియర్ న్యాయవాదులు వాదించినప్పుడు కూడా తాము ఇదే చెప్పామని తెలిపారు. సరైన సమయంలో విభజన అంశంపై కోర్టును ఆశ్రయించవచ్చునని సుప్రీం సూచించింది. ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమంది. జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డేతో కూడిన ధర్మానం వీటిని తోసుపుచ్చింది.

ఫిబ్రవరి 7 నాటి విచారణకు, నేటికి పరిస్థితుల్లో మార్పు లేనందున ఇందులో జోక్యం చేసుకోవడం తొందరపాట అవుతుందన్నారు. పార్లమెంటు అధికార పరిధిలోకి తమను చొరబడమంటారా అని బిజెపి నేత రఘురామ కృష్ణంరాజు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.
విభజన బిల్లు పార్లమెంటు పరిధిలో ఉందని, ఇలాంటి సమయంలో తమను దాని అధికార పరిధిలో చొరబడాలంటున్నారా, కేసులపై విచారణ చేపట్టడం సుప్రీం కోర్టు పని అయితే బిల్లులపై చర్చించడం పార్లమెంటు విధి అని సుప్రీం స్పష్టం చేసింది. కాగా, బిజెపి నేత రఘురామ కృష్ణం రాజు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్, రామకృష్ణ అనే న్యాయవాదులు విభజనకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు.












Click it and Unblock the Notifications