అప్పుడు ఇదే: సుప్రీంలో విభజన పిటిషన్ల తిరస్కరణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం తోసిపుచ్చింది. విభజనకు వ్యతిరేకంగా సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని కోర్టు తోసిపుచ్చింది. విభజన అంశం పార్లమెంటు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని, గతంలో సీనియర్ న్యాయవాదులు వాదించినప్పుడు కూడా తాము ఇదే చెప్పామని తెలిపారు.
సరైన సమయంలో విభజన అంశంపై కోర్టును ఆశ్రయించవచ్చునని సుప్రీం సూచించింది. ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమంది. జస్టిస్ దత్తు నేతృత్వంలోని బెంచ్ వీటిని తోసుపుచ్చింది.

కాగా, పది రోజుల క్రితం ఒకేసారి పది పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఫిబ్రవరి 7న కొట్టి వేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
అపరిపక్వ దశలో ఉన్న పిటిషన్ల పైన విచారణ చేపట్టలేమని, గతంలో వేసిన పిటిషన్లకు ఇప్పటికీ తేడా లేదని పేర్కొంది. పిటిషన్లపై విచారణకు ఇది సరైన సమయం కాదని తెలిపింది. ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటు అవుతుందన్నారు. అదే సమయంలో సరైన సమయంలో కోర్టుకు రావాలని సూచించింది. విభజనపై న్యాయవాదులు చేసిన వాదనలను జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డేతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దాదాపు గంటన్నరపాటు అప్పుడు వాదనలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని ఇప్పుడు కోర్టు తోసిపుచ్చింది.


Click it and Unblock the Notifications