ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్: కేంద్రానికి సుప్రీంకోర్టు 'డెడ్ లైన్'!
దేశంలో ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ, ఆ వర్గాల్లోని ఆర్థికంగా స్థిరపిన వారిని(క్రీమీ లేయర్) రిజర్వేషన్ల నుంచి మినహాయించడంపై సుప్రీంకోర్టు మరోసారి క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాలని.. క్రీమీ లేయర్‌ను మినహాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించిన ధర్మాసనం.. దీనిపై తమ నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
రాజ్యాంగ ధర్మాసన తీర్పుపై ఆరా
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. 2024లో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లను ఉప-వర్గాలుగా విభజించేందుకు (కోటాలో కోటా) అనుమతినిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ తీర్పు వెలువడిన తర్వాత కేంద్ర సర్కారు క్రీమీ లేయర్ అమలుపై లేదా వర్గీకరణపై తీసుకున్న చర్యలు ఏమిటని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది.

పిటిషనర్ల వాదనలు.. డిమాండ్లు
ఓపీ శుక్లా, 'సమతా ఆందోళన్ సమితి' ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. రిజర్వేషన్ల ఫలాలు కేవలం ఒకే వర్గానికి లేదా ఆ వర్గాల్లోని సంపన్నులకే పరిమితం కాకుండా.. అత్యంత వెనుకబడిన ఉప-కులాలకు చేరాలని వారు వాదించారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో వివిధ ఉప-కులాల ప్రాతినిధ్యంపై స్పష్టమైన డేటాను సేకరించాలని.. అలాగే క్రీమీ లేయర్‌ను గుర్తించేందుకు అవసరమైన ప్రమాణాలను నిర్ణయించాలని పిటిషనర్లు కోర్టును కోరారు.
వర్గీకరణపై స్పష్టమైన నిబంధనలు
ఆగస్టు 2024 నాటి తీర్పులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ-ఎస్టీలను వర్గీకరించే అధికారం ఇచ్చింది. అయితే ఈ ప్రక్రియ ఏకపక్షంగా ఉండకూడదని, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా శాస్త్రీయ ఆధారం, తగిన డేటా ఆధారంగానే వర్గీకరణ జరగాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఓబీసీ తరహాలోనే ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లలో కూడా క్రీమీ లేయర్ అమలును పరిశీలించాల్సిన అవసరం ఉందని అప్పట్లోనే అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
కేంద్రం ఇచ్చే వివరణపై ఉత్కంఠ
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తన వివరణ ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను కొద్ది రోజులు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమాధానం, గణాంకాల ఆధారంగానే ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ అమలుపై ఒక తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications