విద్యార్థినిని చితకబాదిన ట్యూషన్ టీచర్
బెంగళూరు: హోం వర్క్ చెయ్యలేదని లేడీ టీచర్ కు కోపం వచ్చింది. అంతే చేతికి చిక్కిన లెదర్ బెల్ట్ తీసుకుని హోం వర్క్ చెయ్యని బాలిక ను ఇష్టం వచ్చినట్లు చితకబాదేసింది. బాలిక వీపు మీద తీవ్రగాయాలైనాయి.
చలించిపోయిన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది. గతంలో లేడీ టీచర్ విద్యార్థులను చితకబాదిందని స్థానికులు చెబుతున్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లా నెలమంగల పట్టణంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నెలమంగలలో టీ షాప్ నిర్వహిస్తున్నశివకుమార్ సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. శివకుమార్ కుమార్తె భావన (7) సెయింట్ జోసెఫ్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్నది. అదే ప్రాంతంలో లతా (40) అనే మహిళ గత 15 సంవత్సరాల నుంచి ప్రయివేటు ట్యూషన్ చెబుతున్నది.

చుట్టు పక్కల ఉన్న విద్యార్థులు అందరూ లతా దగ్గరకు ట్యూషన్ కు వెలుతుంటారు. అక్కడికి భావన చదువుకోవడానికి వెలుతుంది. భావన హోం వర్క్ చెయ్యకుండా ట్యూషన్ కు వెళ్లింది. అంతే విషయం తెలుసుకున్న టీచర్ లతాకు పట్టలేని కోపం వచ్చింది.
చేతికి చిక్కిన లెదర్ బెల్ట్ తీసుకుని భావన వీపు మీద కొట్టింది. వాతలు పడటంతో బొబ్బలు వచ్చాయి. ఇంటికి వెళ్లిన భావన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. శివకుమార్ ఫిర్యాదు చెయ్యడంతో నెలమంగల పోలీసులు లతా మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications