ఆవరించిన కరోనా భయం..మళ్లీ ఆంక్షల పర్వం: అక్కడ నెల రోజుల పాటు నిషేధాజ్ఙలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ భయాందోళనలు మళ్లీ ముసురుకుంటోన్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్నప్పటికీ.. ఈ మహమ్మారి విస్తృతికి అడ్డుకట్ట పడట్లేదు. కొత్త వేరియంట్లతో పుట్టుకొస్తోంది. జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్య దీనికి తోడయింది. దేశ రాజధానిలో కోవిడ్ బాధితులు, జ్వర పీడితుల సంఖ్య పెరగడం కలవరపాటుకు గురి చేస్తోంది.
దేశంలో రోజువారీ కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య ఈ వారం రోజుల వ్యవధిలో భారీగా పెరిగింది. 19,500లకు చేరిందిప్పుడు. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,723 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే.. ఒక్కరోజు వ్యవధిలోనే 408 పాజిటివ్ కేసులు అధికంగా రికార్డయ్యాయి. 26 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,82,345కు చేరింది.
ఇందులో 4,25,38,976 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5,23,869 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లల్లో కొత్త పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న గౌతమ్ బుద్ధ నగర్‌లో 144 సెక్షన్ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు దీన్ని కొనసాగించనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

కోవిడ్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని, భౌతిక దూరాన్ని పాటించాలని అన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు గానీ, నమాజ్, ప్రత్యేక పూజలు నిర్వహించడానికి గానీ అనుమతి ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో మతపరమైన కార్యక్రమాలు, ఉత్సవాలు, ఊరేగింపులు చేపట్టకూడదని పోలీస్ కమిషనర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందని, దీనికి అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను ప్రత్యేకంగా జారీ చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలలు, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి లౌడ్ స్పీకర్లను నిషేధించినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications