తల్లడిల్లుతున్న హర్యానా.. నేడే గుర్మీత్‌కు శిక్ష ఖరారు: భద్రతా వలయంలో రోహతక్
ఉద్రిక్తకర పరిణామాలతో తల్లడిల్లుతున్న హర్యానా ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీంసింగ్‌ను లైంగికదాడి కేసుల్లో దోషిగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం..
చండీగఢ్: ఉద్రిక్తకర పరిణామాలతో తల్లడిల్లుతున్న హర్యానా ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీంసింగ్‌ను లైంగికదాడి కేసుల్లో దోషిగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. అతనికి ఎంత శిక్ష విధించేదీ సోమవారం ప్రకటించనున్నది. మధ్యాహ్నాం 2.30గంటలకు తీర్పు వస్తుందని భావిస్తున్నారు. ఆ వెంటనే హింస మొదలై కొన్ని రోజుల వరకు కొనసాగవచ్చని నేర పరిశోధన విభాగం (సీఐడీ) హెచ్చరించింది.
సోమవారం శిక్షను ఖరారు చేయనున్న నేపథ్యంలో మళ్లీ హింసాకాండ చెలరేగవచ్చని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని రాష్ట్ర సీఐడీ విభాగం ఐజీ నివేదిక ఇచ్చారు. మరికొద్దిరోజులు అల్లర్లు కొనసాగవచ్చని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు 28న కోర్టు శిక్ష ఖరారు చేయనుండటంతో ఆ రోజు హింసాకాండ చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నది అని హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రామ్ నివాస్ తెలిపారు.
భద్రతపరమైన సమస్యలు తలెత్తకుండా రోహ్‌తక్ నగర శివార్లలోని సునారియా వద్దనున్న జైలులోనే తాత్కాలిక కోర్టు ఏర్పాట్లు చేశారు. అక్కడే తీర్పు చెప్పేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్‌దీప్‌సింగ్‌ను న్యాయస్థాన సిబ్బందితో కలిసి హెలికాప్టర్‌లో అక్కడకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. శుక్ర-శనివారాల్లో డేరా అనుచరులు పాల్పడిన విధ్వంస, భీభత్సకాండను దృష్టిలో పెట్టుకుని అసాధారణ భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఆదివారం కొత్తగా ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోలేదు. పుకార్లు వ్యాపించకుండా అడ్డుకోవడంలో భాగంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు అంతర్జాల సేవల్ని స్తంభింపజేస్తున్నారు. డేరా ప్రధాన కార్యాలయానికీ ఇది వర్తిస్తుంది. శిక్ష గురించి ప్రకటించిన తర్వాత ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.

ఎటు చూసినా బలగాలే
సునారియాలో ఎటు చూసినా భద్రత బలగాలే మోహరించి ఉన్నాయి. 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. హర్యానా, పంజాబ్‌లలో అన్ని విద్యాసంస్థల్నీ సోమవారం కూడా మూసివేస్తారు. అల్లర్లలో మృతిచెందినవారి సంఖ్య 36 నుంచి 38కి పెరిగిందనీ, మృతులందరి గుర్తింపు పూర్తయిందనీ హర్యానా డీజీపీ బి.ఎస్.సంధు తెలిపారు. హింసకు సంబంధించి 52 కేసుల్లో 926 మందిని అరెస్టు చేసినట్లు ఆయన మీడియాతో చెప్పారు. గుర్మీత్ రాం రహీంసింగ్‌ను పెట్టిన జైలు చుట్టూ బహుళ అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తీర్పు వెలువడ్డాక ఎవరైనా ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదన్నారు. డేరా ప్రధాన కేంద్రం ఉన్న సిర్సా మినహా మిగిలిన అన్నిచోట్లా కర్ఫ్యూ ఎత్తివేశామని చెప్పారు. 103 డేరా కేంద్రాలను మూసివేశామనీ, వీటి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, లాఠీలు, ఇంధనం సీసాలు, గొడ్డళ్లు, కొడవళ్లు, 66 పెప్పర్ స్ప్రేలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామనీ తెలిపారు.

కర్ఫ్యూలోనూ అవిశ్రాంత సేవలు
కీలకంగా నిలిచే డేరా అనుచరులిద్దరిపై రాజద్రోహం, హత్యాయత్నాల కింద రెండు కేసుల్ని నమోదు చేసినా వాటి గురించి మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండడంతో పోలీసులు వివరాలు చెప్పడం లేదు. ఈ అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో అయిదుగురు పోలీసులూ ఉండడం విశేషం. గుర్మీత్‌ను దోషిగా ప్రకటించిన తర్వాత కోర్టు వెలుపల హరియాణా పోలీసులతో తగాదా పడినవారిలో అతని భద్రత దళంలోని పోలీసులు కూడా ఉన్నారు. ఇప్పుడు వారిపైనా రాజద్రోహం కేసు నమోదయింది. ఒకపక్క కర్ఫ్యూతో ఆంక్షలున్నా హర్యానాలోని సిర్సాలో భద్రత బలగాలకు, సైనికులకు, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు సమయానికి ఆహార పొట్లాలు సరఫరా చేస్తూ కొంతమంది స్వచ్ఛంద సేవకులు అందరినీ ఆకట్టుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి వీరు వంటలకు ఉపక్రమించి, మోటారు బైకులపై, ట్రాక్టర్లపై అన్ని ప్రాంతాలకు వెళ్తూ సేవలందిస్తున్నారు. మొత్తం 120 సేవా సంస్థలు దీనిలో పాల్గొంటున్నాయి. ఇచ్చే గుణానికి మారుపేరైన సిర్సాలో ఈ దాతృత్వాన్ని చూసి భద్రత బలగాలు అబ్బురపడుతున్నాయి. అవసరమైన వారికి ఆహారం అందించడానికి ‘రోటీ బ్యాంకు'ను కూడా ప్రారంభించారు.

ఆస్తులపై రెండు ప్రభుత్వాల ఆరా
డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌సింగ్‌కు పడే శిక్ష గురించి సోమవారం న్యాయస్థాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో దిల్లీలో పోలీసులు అత్యంత అప్రమత్తత (హై అలర్ట్) ప్రకటించారు. నిఘాను తీవ్రతరం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. నార్త్, సెంట్రల్ ఢిల్లీ మినహా దేశ రాజధాని హస్తిన అంతటా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. డేరా ఖాతాల కోసం బ్యాంకర్లను కోరినట్లు గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ వినయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు డేరా సచ్చా సౌదాకు చెందిన ఆస్తుల వివరాలను పంజాబ్, హర్యానా ప్రభుత్వాల రెవెన్యూ శాఖలు సేకరిస్తున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు దేశ ద్రోహం సెక్షన్ కింద ఒక మహిళతోపాటు ఎనిమిది మంది గుర్మీత్ మద్దతుదారులను అరెస్ట్ చేశామని పానిపట్ డీఎస్పీ ఆత్మారాం తెలిపారు. డేరా మద్దతుదారులపై రెండు దేశద్రోహం కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే పూర్తి వివరాలు వెల్లడించలేదు. తాజా పరిస్థితిపై మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామన్నారు.

గుర్మీత్ మద్దతుదారులు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు
సిర్సాలోని డేరా సచ్చా సౌధా ప్రధాన కేంద్రంలో ఇప్పటికీ సుమారు 30 వేల మంది గుర్మిత్ రాం రహీం సింగ్ అభిమానులు తిష్ఠ వేశారు. లోపల నుంచి బయటకు రావాలని పదేపదే అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసినా గుర్మీత్ ప్రేమీ అభిమానులు అందుకు నిరాకరిస్తున్నారు.ఒక మీడియా వ్యాన్‌పై డేరా మద్దతు దారులు దాడి చేశారని అనుమానిస్తున్నారు. డేరా ప్రధాన కేంద్రంలో తిష్ఠ వేసిన వారు ఎటువంటి అవాంఛనీయ చర్యలకు దిగకుండా దాని చుట్టూ పోలీసులు, సైన్యం భద్రతావలయం ఏర్పాటు చేశారు.
పంజాబ్, హర్యానాల్లో 500 మందికి పైగా డేరా మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కేంద్రంలో ఉన్న గుర్మీత్ మద్దతుదారులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు ఐదు హర్యానా రోడ్‌వేస్ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటికే ఎనిమిది కంపెనీల సైన్యం సిర్సాలో విధులు నిర్వహిస్తుండగా, మరో నాలుగు కంపెనీల సైన్యాన్ని ఆదివారం నియోగించారు. ఢిల్లీ రోహతక్ భటిండా సెక్షన్ మినహా మిగతా మార్గాల్లో 26 రైలు సర్వీసులు పునరుద్ధరించామని నార్తర్న్ రైల్వేస్ సీపీఆర్వో నీరజ్ శర్మ చెప్పారు. శుక్రవారం నాటి అల్లర్లలో హింసకు పాల్పడి గాయపడిన వారికి ఎటువంటి నష్ట పరిహారం చెల్లించబోమని పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ స్పష్టం చేశారు.

అందుబాటులోనే సైన్యం.. కీలక ప్రదేశాల్లో ఫ్లాగ్ మార్చ్
గుర్మీత్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారుచేసిన తర్వాత ప్రేమీలుగా పేర్కొనే డేరా సచ్చా సౌదా అభిమానులు సామూహిక ఆత్మాహుతికి పాల్పడే అవకాశాలున్నాయని నిఘావర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. వారు ఇందుకోసం పౌఢే భీజో అనే సంకేత నామం వాడుతారని గుర్తించారు. ఈ నేపథ్యంలో సౌదా అభిమానులుగా ఉండే వారిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే తమకు ప్రథమ ప్రాధాన్యం అని హర్యానా డీజీపీ బీఎస్ సంధూ తెలిపారు. ఇప్పటివరకు 52 కేసులు నమోదు చేశామన్నారు. గుర్మిత్‌ను జైలుకు తరలించకుండా అడ్డుకున్నందుకు ఆయన ఏడుగురు వ్యక్తిగత భద్రతాగార్డులపై దేశ ద్రోహం, హత్యాయత్నం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రోహతక్, సిర్సాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైతే అందుబాటులో ఉండాలని సైన్యాన్ని హర్యానా ప్రభుత్వం కోరింది. అయితే డేరా ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు ఇంకా తమకు అనుమతి రాలేదని సైన్యం తెలిపింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications