ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్: సీరం సంస్థకు షాక్ - భారత్ లో ట్రయల్స్ కొనసాగింపుపై డీసీజీఐ నోటీసులు
ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి సీరం ఇనిస్టిట్యూట్ కు ఎదురుదెబ్బ తగిలింది. స్విడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా.. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి 'కొవిషీల్డ్' పేరుతో రూపొందిన వ్యాక్సిన్ యూకేలో వికటించిన దరిమిలా వివిధ దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేయగా.. ఇండియాలో భాగస్వామిగా ఉన్న సీరం సంస్థ మాత్రం ట్రయల్స్ కొనసాగిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ''డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)'' ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ ట్రయల్స్ కొనసాగింపుపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ బుధవారం నోటీసులు జారీ చేసింది.
''ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన టీకా డోసు వల్ల ఒక వాలంటీర్ కు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, దీంతో క్లినికల్స్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆస్ట్రాజెనికా సంస్థ ప్రకటించిన విషయం మా దృష్టికి వచ్చింది. అయితే అదే వ్యాక్సిన్ కు సంబంధించి ఇండియాలో మాత్రం ఇంకా ట్రయల్స్ ఆగలేదు. ప్రజల సేఫ్టీ దృష్ట్యా కనీసం మాకు వివరణ కూడా ఇవ్వలేదు. దీనిని బాధ్యతారాహిత్యంగానే మేం భావిస్తున్నాం. భారత్ లో క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిస్తూ ఆగస్టు 2 న మీకు ఇచ్చిన అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పడి'' అంటూ సీరం సంస్థకు డీసీజీఐ నోటీసులు పంపింది.

'కొవిషీల్డ్' వ్యాక్సిన్ కు సంబంధించి యూకేలో తలెత్తిన లోపాలేవీ భారత్ లో చోటుచేసుకోలేదని, కాబట్టి క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తామని, ముందుగా ప్రకటించిన టైమ్ లైన్ ప్రకారమే ప్రకారమే టీకాను తీసుకొస్తామని సీరం సంస్థ సీఈవో అధర్ పునావాలా మీడియాకు వివరణ ఇచ్చిన కొద్ది సేపటికే డీసీజీఐ నోటీసులు పంపడం గమనార్హం. భారత్ లో మొత్తం 17 చోట్ల సీరం ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక్కో సెంటర్లో 1000 మందికిపైగా వాలంటీర్లు ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications