కరోనా వ్యాక్సిన్ కొరతకు చెక్: వచ్చే 4 నెలల్లో ఉత్పత్తి భారీగా పెంచుతామన్న సీరమ్, భారత్ బయోటెక్
న్యూఢిల్లీ: దేశంలో ఓ వైపు కరోనా వ్యాక్సిన్ కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడంపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థలు కీలక నిర్ణయం ప్రకటించాయి. వచ్చే నాలుగు నెలల్లో చేపట్టబోయే తమ ఉత్పత్తి ప్రణాళికలను ఈ సంస్థలు ప్రభుత్వానికి సమర్పించాయి.

ఆగస్టు నాటికి భారీగా కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి
ఆగస్టు నాటికి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా(పుణె) 10 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తయారు చేస్తుంది. ఇక భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ 7.8 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనుంది. జులై నెలలో 3.32 కోట్ల డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తామని, ఆగస్టు నాటికి 7.82 కోట్లకు పెంచుతామని భారత్ బయోటెక్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోన్ ప్రభుత్వానికి తెలిపారు. సెప్టెంబర్ నెలలోనూ అదే స్థాయిలో ఉత్పత్తి కొనసాగిస్తామన్నారు.

10 కోట్ల వ్యాక్సిన్ డోసులు తయారు చేస్తామన్న సీరమ్
ఆగస్టు నాటికి 10 కోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను తయారు చేస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని, దీని వల్ల జూన్, జులై నెలల్లో ఉత్పత్తి కొంత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, దేశీయంగా తయారైన వ్యాక్సిన్ల కొరత కారణంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక తోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించాయి.
Recommended Video

కోవాగ్జిన్ సరఫరాపై విమర్శలు బాధాకారం
తమకు అదనపు డోసుల టీకా కావాలని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా భారత్ బయోటెక్‌ను కోరగా.. ముందుగా చెప్పినదానికంటే మించి ఇప్పుడు సరఫరా చేయలేమని సంస్థ స్పష్టం చేసింది. టీకాల ఎగుమతి పెంచి, దేశంలోనే ఎక్కువ టీకాలను సరఫరా చేయాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కోరారు. కాగా, కోవాగ్జిన్ టీకా సరఫరా చేయడంలో తమపై కొన్ని రాష్ట్రాలు విమర్శలు చేయడం విచారకరమని భారత్ బయోటెక్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మే 10న 18 రాష్ట్రాలకు టీకాలను సరఫరా చేసినట్లు భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. మరోవైపు కరోనా బాధితులు త్వరగా కోలుకునేందుకు ఉపయోగించే బారిసిటినిబ్ ఔషధాన్ని తయారు చేసి విక్రయించడానికి ఎలి లిల్లీతో డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ వాలంటరీ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.












Click it and Unblock the Notifications