ఇక ఇండియన్ స్కూల్స్ లో 'సెక్స్ ఎడ్యుకేషన్'
న్యూఢిల్లీ : సాంప్రదాయిక దేశమైన భారత్ లో నలుగురి ముందు సెక్స్ అన్న పదాన్ని ఉచ్చరించడానికే సంకోచించే పరిస్థితి. తరాలుగా దాన్నో బూతులాగే భావిస్తూ రావడం వల్ల, సెక్స్ కి సంబంధించిన జ్నానం, కనీస అవగాహన దేశ యువతలో కొరవడుతోంది. ఫలితంగా అవగాహన రాహిత్యంతో లేత ప్రాయంలోనే తప్పుదోవ పడుతున్న యువత తర్వాత అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.
ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న బోల్డ్ నెస్ టీనేజర్లను తప్పుదోవ పట్టించకుండా ఉండాలంటే.. హార్మోన్ల ప్రభావం వల్ల టీనేజ్ లో తలెత్తే శారీరకపరమైన మార్పుల గురించి వాళ్లకంటూ సొంత అవగాహన ఉండడం తప్పనిసరి. కాబట్టి ఇప్పటి విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ నేపథ్యంలోనే ఏళ్లుగా చర్చల్లోనే నానుతూ, ఆచరణకు దూరంగా ఉండిపోయిన సెక్స్ ఎడ్యుకేషన్ త్వరలోనే పాఠశాల విద్యార్థులకు చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుండడమే ఇప్పుడు ఈ చర్చలకు ప్రధాన కారణం. లైంగిక అవయవాలపై, పునరుత్పత్తిపై, శృంగారానికి సంబంధించిన పలు విషయాలపై భారతీయ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే సెక్స్ ఎడ్యుకేషన్ ని ఓ పాఠ్యాంశంగా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే దీనిపై కసరత్తులు మొదలవగా.. దీనికి సంబంధించిన ప్రణాళికను వచ్చే వారం మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముందుంచనున్నట్టు సమాచారం. కాగా, సెక్స్ ఎడ్యుకేషన్ పై ఇంకా కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో దీని అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పాఠశాల స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కి 'కౌమార పునరుత్పత్తి, శృంగార ఆరోగ్య విద్య' అనే పేరు పెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పాఠ్యాంశాల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఎయిడ్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు సంయుక్తంగా కొన్ని ప్రతిపాదనలను సిద్దం చేశాయి.
ఈ సంస్థల ప్రతిపాదనలను పరిశీలించిన కొంతమంది శాస్త్రవేత్తలు, నిరభ్యంతరంగా వీటిని పాఠశాల స్థాయిలో బోధించవచ్చునని చెబుతున్నారు. ఇక సెక్స్ ఎడ్యుకేషన్ పై వస్తున్న వివాదాల పట్ల స్పందిస్తూ.. ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయాలనుకోవడం తగదని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ సూచించారు.












Click it and Unblock the Notifications