వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు: క్రీడారంగంలో వేధింపులకు గురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? బాధితుల రక్షణకు ఉన్న చట్టాలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కొందరు మహిళా రెజ్లర్‌లు ఆరోపణలు చేశారు.

అయితే లైంగిక వేధింపుల ఆరోపణలను తోసిపుచ్చుతూ రాజీనామాకు బ్రిజ్ భూషణ్ నిరాకరించారు.

మరోవైపు చర్యలు తీసుకునే వరకు తమ నిరసన కొనసాగిస్తామని భారత రెజ్లింగ్ క్రీడాకారులు తెగేసి చెబుతున్నారు. ఈ ధర్నాలో మహిళా అథ్లెట్లతో పాటు పురుష క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు.

అయితే, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు మేరీకోమ్, యోగేశ్వర్ దత్ సహా ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని శుక్రవారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ప్రకటించారు. అనంతరం రెజ్లర్లు తమ నిరసనను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, 'నేను ఎవరి దయాదాక్షిణ్యాలతో సీట్లో కూర్చోలేదు, ఎన్నికైన అధ్యక్షుడిని'' అన్నారు .

అంతకుముందు ఆయన, "ఏ అథ్లెట్ కూడా లైంగిక వేధింపులకు గురికాలేదు, అది నిజమని తేలితే, ఉరి శిక్షకైనా సిద్ధం" అని అన్నారు.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ క్రీడాకారులతో మాట్లాడుతూ, ''మేం అండగా నిలుస్తాం, మీకు న్యాయం చేస్తాం'' అని హామీ ఇచ్చారు.

మరోవైపు బీజేపీ మహిళా నేతల మౌనాన్ని ప్రశ్నిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ''ఈ వారం బీజేపీ మహిళ నేతలు మౌన దీక్షలో ఉన్నారా? బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ గురించి మహిళా రెజ్లర్లు చెబుతున్న భయానక విషయాలు మహిళా మంత్రులెవరూ ఎందుకు వినడం లేదు?" అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

కాగా, ఈ విషయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి క్రీడా మంత్రిత్వ శాఖ వివరణ కోరింది.

ఫిర్యాదు చేయకుండా ధర్నా ఎందుకు చేస్తున్నారు?

క్రీడల్లో లైంగిక వేధింపుల వార్తలు కొత్తేమీ కాదు. గత ఏడాది ఒక సైక్లిస్ట్ కూడా లైంగిక వేధింపుల గురించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి ఫిర్యాదు చేశారు. ఈ సైక్లిస్ట్ తన కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

ఇటీవల హర్యానా క్రీడా శాఖ సహాయ మంత్రి, మాజీ హాకీ ఆటగాడు సందీప్ సింగ్‌పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఓ మహిళా హాకీ జట్టు కోచ్ సందీప్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సాయ్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆరోపణలపై దర్యాప్తునకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక కథనం ప్రకారం గత పదేళ్లలో 45 లైంగిక వేధింపుల ఫిర్యాదులు సాయ్ ముందు వచ్చాయి. వాటిలో 29 ఫిర్యాదులు కోచ్‌లపై ఉన్నాయని పేర్కొంది.

సదరు వార్తాపత్రిక సమాచార హక్కు చట్టం కింద ఈ సమాచారాన్ని పొందింది. రెజ్లింగ్ ప్లేయర్ వినేష్ ఫోగట్ విలేకరులతో మాట్లాడుతూ "కోచ్‌లు మహిళలను వేధిస్తున్నారు. ఫెడరేషన్‌కు ఇష్టమైన కోచ్‌లు కొందరు మహిళా కోచ్‌లతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిలను వేధిస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చాలా మంది అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేశారు'' అని ఆరోపించారు.

అదే సమయంలో ఈ మహిళలు సరైన ఫోరం ముందు ఫిర్యాదు ఎందుకు చేయలేదు.? ధర్నా సరైన చర్యా? కాదా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఈ ప్రశ్నపై క్రీడా నిపుణులు, సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా స్పందించారు. ''భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టిన ఆటగాళ్లు ఇలా ధర్నాకు దిగుతున్నారు, ఇప్పటి వరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరం'' అని వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతూ “చట్ట ప్రకారం అంతర్గత కమిటీ వేయాలి. దానికి అధ్యక్షత మహిళ వహించాలి, కమిటీలో 50 శాతం మహిళలు ఉండాలి.

అయితే ఈ కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యుల్లో ఒకే మహిళ ఉన్నారు, ఇది ఎలాంటి కమిటీ? ఈ కమిటీ రాష్ట్రపతి ఏర్పాటు చేసినా, కమిటీ వద్దకు వెళ్లడంలో ప్రయోజనం ఏంటి?

పోలీసుల వద్దకు వెళ్లడం వారికి సముచితంగా అనిపించలేదు. కాబట్టి వారు నిరసన మార్గం ఎంచుకున్నారు. మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్పారు'' అని తెలిపారు.

లైంగిక వేధింపుల కట్టడికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి?

పని స్థలంతో సంబంధం లేకుండా లైంగిక వేధింపులకు సంబంధించి చట్టంలో నిబంధనలు రూపొందించారని లాయర్ రాహుల్ మెహ్రా చెబుతున్నారు.

పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు సంబంధించి భారతదేశంలో పోష్ చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్) 2013 తీసుకువచ్చారు.

ఈ చట్టాన్ని ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ ఆఫ్ వర్క్‌ప్లేస్ యాక్ట్ 2013 అని కూడా అంటారు.

ఈ చట్టం పరిధిలోకి వర్క్‌ప్లేస్, స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్, స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలా అన్నీ వస్తాయి.

ఆ వేదిక నివాస స్థలం కావచ్చు లేదా శిక్షణ జరిగే ప్రదేశం కావచ్చు. లేదా ఏదైనా క్రీడలకు సంబంధించిన కార్యక్రమం కావచ్చు. తప్పకుండా ఆ చట్టం పరిధిలోకి వస్తాయి.

శారీరక, మౌఖిక సంబంధిత చర్యలు లైంగిక వేధింపులకు సంబంధించినవిగా పరిగణిస్తారు. దీని పరిధిలోకి అసభ్యకరమైన భాష లేదా సంజ్ఞలూ వస్తాయి.

మరోవైపు ఎవరైనా, ఏదైనా పనికి బదులుగా లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేసినా, బెదిరించినా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

బ్రిజ్ భూషణ్

చట్టంలోని నిబంధనలేంటి?

10 మంది కంటే ఎక్కువ మంది కార్యాలయంలో పని చేస్తే అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేయాలని ఈ చట్టం చెబుతోంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారించడం, పరిష్కరించడం ఈ కమిటీ పని.

అదే సమయంలో మహిళల భద్రతను పర్యవేక్షించడం జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్)ల బాధ్యత అని నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోడ్ ఆఫ్ ఇండియా-2011 పేర్కొంది.

దీంతో పాటు లైంగిక వేధింపుల నివారణ, నిబంధనల గురించి చెప్పడం, మహిళలు వారి సమస్యలను లేవనెత్తే వేదికల ఏర్పాటు ఉండాలని చెబుతోంది.

అయితే ఇవి అమలవుతున్నాయో లేదో క్రీడా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందా? అని న్యాయవాది రాహుల్ మెహ్రా ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు 10 మంది కంటే తక్కువ మహిళలు పనిచేసే లేదా అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు జిల్లా స్థాయిలో ఏర్పడిన స్థానిక కమిటీకి వెళ్లి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.

బాధిత మహిళలు 3 నెలల్లో కమిటీ ముందు ఫిర్యాదు చేయాలి. వారు 3 నెలల తర్వాత ఫిర్యాదు చేస్తే, సరైన కారణాలు తెలియజేయాలి. కమిటీ వారి వాదనతో సంతృప్తి చెందితే, ఫిర్యాదును స్వీకరిస్తారు. అయితే దీనర్థం బాధితురాలు ఫిర్యాదు చేయలేదని కాదు.

మరోవైపు చట్టం ప్రకారం కార్యాలయ యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే, చట్టంలో 50,000 జరిమానా విధించే నిబంధన కూడా ఉంది.

చట్టం

నేరం రుజువైతే ఎలాంటి శిక్షలు విధిస్తారు?

కార్యాలయంలో లైంగిక వేధింపుల కేసుపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) సిద్ధం చేస్తుంది.

విచారణలో నేరం రుజువైతే పోలీసులకు ఐసీసీ ఫిర్యాదు చేసి, దాని దర్యాప్తు నివేదికను సమర్పించాలి. ఈ విచారణ సమయంలో మహిళ 3 నెలల వరకు సెలవు పొందవచ్చు. లేదా తన కార్యాలయంలోని మరొక శాఖకు తనను తాను బదిలీ చేసుకోవచ్చు.

మరోవైపు మహిళ ఆరోపణలు అబద్ధమని తేలితే ఆమెపై చర్యలు తీసుకునేందుకూ చట్టంలో నిబంధన ఉంది. మహిళ తన ఫిర్యాదుపై ఎటువంటి చర్య తీసుకోకూడదని కోరుకుంటే రెండు పార్టీల మధ్య రాజీ కూడా చేయవచ్చు. కానీ ఇది డబ్బు లావాదేవీ ఆధారంగా చేయకూడదు.

మరోవైపు నేరం రుజువైతే శిక్షలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రతి నేరానికి వేర్వేరు సెక్షన్ల కింద శిక్ష విధించనున్నారు. ఉదాహరణకు వేధింపుల విషయంలో సెక్షన్ 354లో జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. రెండేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. లేదా జైలు శిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు. సెక్షన్ 376 (అత్యాచారం)లో ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. జీవిత ఖైదూ పడవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sexual Harassment: Who to complain to in case of harassment in sports? What are the laws for the protection of victims?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X