'మహా'రాజకీయాల్లో లెటర్ బాంబ్ దుమారం... హోంమంత్రిని తప్పిస్తారా... ఉద్దవ్ ఏం చేయబోతున్నారు?
అంబానీ ఇంటి వద్ద బాంబు కలకలం కేసు కాస్త... మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అలజడికి దారితీసేలా మారింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇది ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్... హోంమంత్రిగా అనిల్ దేశ్‌ముఖ్ కొనసాగుతారని స్పష్టం చేశారు. అదే సమయంలో అంతిమ నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేదే అని పేర్కొనడం గమనార్హం.

అప్పుడు హోంమంత్రి ఆస్పత్రిలో ఉన్నారు : పవార్
'ఫిబ్రవరి నెల మధ్యలో ముంబై క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ హెడ్ సచిన్ వాజేని తన అధికారిక నివాసానికి పిలిపించుకున్న హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్... రూ.100 కోట్లు వసూళ్లకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు... ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ ఒక విషయాన్ని గమనిస్తే.. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 16 వరకూ అనిల్ దేశ్‌ముఖ్ ఆస్పతిలో కరోనా చికిత్స పొందారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకూ నాగ్‌పూర్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. కాబట్టి లేఖలో ఆరోపించినట్లు ఫిబ్రవరి నెల మధ్యలో అనిల్ దేశ్‌ముఖ్ సచిన్ వాజేని పిలిపించుకుని మాట్లాడారని చేసిన ఆరోపణలు నిరాధారం...' అని శరద్ పవార్ స్పష్టం చేశారు.
ప్రతీ నెలా రూ.100కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి ఆర్డర్... ముంబై మాజీ పోలీస్ బాస్ సంచలన ఆరోపణలు...

హోంమంత్రిని తప్పిస్తారా...?
హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరమ్ వీర్ సింగ్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని... కాబట్టి లోతైన దర్యాప్తు లేకుండా అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోలేమని శరద్ పవార్ తెలిపారు. అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రి పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే దీనిపై తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేదే అని పేర్కొన్నారు. ఇదే విషయంపై చర్చించడానికి మహా వికాస్ విఘాడీ భాగస్వామ్య పార్టీలన్నీ సోమవారం(మార్చి 22) ఢిల్లీలో సమావేశమవుతున్నాయి. ఈ సమావేశంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై చర్చించి... ఆయన్ను తప్పించడమా... కొనసాగించడమా అన్నది నిర్ణయించే అవకాశం ఉంది.
ఆస్పత్రిలో కాదు... ప్రెస్‌మీట్ కూడా పెట్టాడు : బీజేపీ
మరోవైపు బీజేపీ మాత్రం శరద్ పవార్ వ్యాఖ్యలను ఖండించింది. ఫిబ్రవరి 15న హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారని... కానీ పవార్ మాత్రం ఆరోజు దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పడమేంటని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. ఎన్సీపీ సీనియర్ నేత,మంత్రి నవాబ్ మాలిక్ బీజేపీ ఆరోపణలను కొట్టిపారేశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాక ముఖ్యమంత్రి ఉద్దవ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాబట్టి ఇప్పటికిప్పుడు దేశ్‌ముఖ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఉద్దవ్‌దే అంతిమ నిర్ణయం...
ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే సాయంత్రం 4.30గంటల సమయంలో రాష్ట్ర న్యాయశాఖ అధికారులతోనూ భేటీ కానున్నారు. కాంగ్రెస్,ఎన్సీపీలతో చర్చల అనంతరం... వారితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారంపై చర్చించేందుకే వారితో భేటీ అవుతున్నట్లు సమాచారం. కాగా,అంబానీ ఇంటి వద్ద బాంబు కలకలం కేసులో అనుమానితుడిగా ముంబై మాజీ క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ హెడ్ సచిన్ వాజేని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్‌పై కూడా బదిలీ వేటు పడింది. అయితే అన్యాయంగా తనపై బదిలీ వేటు వేశారని ఆరోపించిన పరమ్ వీర్ సింగ్... హోంమంత్రిగా అనిల్ దేశ్‌ముఖ్ తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి లేఖ రాశారు. ముంబైలోని బార్లు,హోటళ్ల నుంచి,ఇతరత్రా మార్గాల ద్వారా ప్రతీ నెలా రూ.100 కోట్లు
వసూలు చేసివ్వాలని హోంమంత్రి దేశ్‌ముఖ్ సచిన్ వాజేకి టార్గెట్ ఫిక్స్ చేశారని ఆరోపించారు. అయితే ఇదంతా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేస్తున్న కుట్ర అని మహా వికాస్ అఘాడీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.