ఉద్ధవ్ థాక్రేకు నిరాశ: ఈసీ ఆదేశాలపై స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, షిండే వర్గానికి నోటీసులు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తును కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌పై ఉద్ధవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు బుధవారం విచారించింది.
ఎన్నికల సంఘం నిర్ణయానికి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని ఉద్ధవ్ థాక్రే తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ కోర్టును కోరారు. అయితే, ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో ఆర్డర్‌పై స్టే ఇవ్వలేమని స్ఫష్టం చేసింది.

ఉద్ధవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేయాలని ఏక్‌నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. థాక్రే వర్గానికి చెందిన చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు ఎలాంటి విప్ జారీ చేయబోమని, ఏ చర్యలు ప్రారంభించబోమని షిండే వర్గం తరపు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఆ తర్వాత విచారణను కోర్టు వాయిదా వేసింది.
కాగా, శివసేన పార్టీ, గుర్తులను షిండే వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్ధవ్ థాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలన్నారు. ఎన్నికల సంఘం అధిపతులను కూడా ప్రజలే ఎన్నుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీ, ఎన్నికల గుర్తులు లాక్కోగలరేమో కానీ.. థాక్రే అనే పేరును మాత్రం తమను నుంచి వేరు చేయలేరని ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications