ఎన్నికల సమయంలో కమల్ హాసన్ కు షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత బీజేపీలో చేరిక
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమల్ హాసన్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది . వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో విజయకేతనం ఎగురవేయాలని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు ఎ అరుణాచలం మక్కల్ నీది మయ్యం కు గుడ్ బై చెప్పి శుక్రవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సమక్షంలో బిజెపిలో చేరారు.
రజనీకాంత్ ఓకే అంటే సీఎంగా బరిలో దిగుతానన్న కమల్ హాసన్: తలైవా పార్టీ పొంగల్ కే

మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అరుణాచలం పార్టీకి రాజీనామా .. బీజేపీలో చేరిక
మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అరుణాచలం, కేంద్రం యొక్క వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇవ్వడానికి కమల్ హాసన్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అరుణాచలం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షా రైతుల మేలు కోసం మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించారని , వ్యవసాయ కుటుంబం నుండి వస్తున్న వారి ప్రయోజనాలు నాకు తెలుసునని ఆయన పేర్కొన్నారు .

వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇవ్వని కారణంగానే పార్టీకి గుడ్ బై చెప్పానన్న సీనియర్ నేత
కేంద్రం నిర్ణయానికి మద్దతు ఇవ్వమని కమల్ హాసన్ ని కోరానని చెప్పిన ఆయన, కానీ తన అభ్యర్థనను వారు నిరాకరించారు అని అరుణాచలం అన్నారు.
అనేక సందర్భాల్లో తాను చట్టాలను బిజెపి తీసుకువచ్చిన చట్టాలుగా పరిగణించవద్దని చెప్పానని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం ముందుకు వచ్చింది. వారు సెంట్రిస్ట్ పార్టీ అని తాను కమల్ హాసన్ కు చెప్పానని ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కోరారని, అలా ఇవ్వకుంటే ప్రతిపక్షానికి , మక్కల్ నీది మయ్యం కు మధ్య తేడా ఉండదు అని కూడా చెప్పానన్నారు.

రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలో ఉండలేనని వెల్లడి , కమల్ కు ఎన్నికల టైం లో షాక్
కమల్ హాసన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారని అందుకే తాను పార్టీకి రాజీనామా చేశానని అరుణాచలం చెప్పారు. రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలో తాను ఇక ఉండలేనని, అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నా అని స్పష్టం చేశారు.
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరగనున్న నేపథ్యంలో బీజేపీలోకి ఇతర పార్టీల నేతలు వలసలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మక్కల్ నీది మయ్యం లో కీలక నేతగా ఉన్న అరుణాచలం పార్టీకి గుడ్ బై చెప్పడం కమల్ హాసన్ పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పాలి.