ఏ క్యా పబ్లిసిటీ హై... మొన్న వెడ్డింగ్ కార్డులు నేడు చీరలపై మోడీ ఫోటోలు
కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్లుగా తయారైంది త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో పరిస్థితి. ముఖ్యంగా ఈ సారి ఎలాగైనా మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ మేనియా ఇంకా ఉంది అని ప్రచారం చేసే క్రమంలో సంచలనాలకు తెర తీసింది.

ప్రచారం కోసం ప్రతి వస్తువుని వాడేస్తున్న బీజేపీ
ప్రధాని మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు బిజెపి నేతలు. మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ పై అభిమానాన్ని చాటు కోవడానికి బిజెపి అభిమానులు వెళ్లి శుభలేఖలను ప్రచారాస్త్రంగా వాడితే, ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలతో చీరలు మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది.

మార్కెట్ లో సందడి చేస్తున్న మోడీ చీరలు... ఫుల్ గిరాకీ
‘మాపెళ్లికి మీరు గిఫ్టులు ఇవ్వొద్దు కానీ మోడీ కి ఓటేయ్యండని' కోరిన ఉదంతాలు, వెడ్డింగ్ ఇన్విటేషన్ లపై మోడీ ఫోటోలు వేసుకున్న ఘటనలు మర్చిపోకముందే ఇప్పుడు మోడీ చీరలు సందడి చేస్తున్నాయి. అంతేకాదు మహిళా ఓటర్లను ఆకర్షించటానికి బొట్టు బిళ్లల ప్యాకెట్ పై ఏకంగా మోడీ బొమ్మను ముద్రించారు.
మన్‌కీ బాత్, మోడీ విజన్, సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్.. ఇలా వివిధ రకాల పేర్లతో తయారైన చీరలు మహిళలను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సరికొత్త చీరలను కట్టుకుని మహిళలు మురిసిపోతున్నారు. దీనిపై వ్యాపారులు కూడా హర్షం చేస్తున్నారు. దేశంలో మోడీ మేనియా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమంటున్నారు బీజేపీ నేతలు .

మోడీది పబ్లిసిటీ స్టంట్ అంటున్న ప్రతిపక్ష నేతలు
అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇదంతా కావాలని బిజెపి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని, ప్రజలలో మోడీ మేనియా అంతగా లేదని, బిజెపి సర్కార్ పై తీవ్రమైన వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రచార హంగామా చూస్తున్న వారంతా మోడీ జీ... ఏ క్యా పబ్లిసిటీ హై అంటున్నారు.












Click it and Unblock the Notifications