
షాకింగ్: యజమానిపై పెంపుడుకుక్క పిట్‌బుల్ దాడి; తీవ్ర గాయాలతో రిటైర్డ్ టీచర్ మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్క పిట్‌బుల్ యజమాని పై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ మృతి చెందిన ఘటన స్థానికులను ఆవేదనకు గురి చేసింది. మంగళవారం ఉదయం లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో 82 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌ను ఆమె కొడుకు పెంపుడు పిట్‌బుల్ కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ఆమె మృతి చెందింది.

యజమానిపై దాడి చేసిన పెంపుడు కుక్క పిట్ బుల్
ఇక ఘటన వివరాల్లోకి వెళితే కైసర్‌బాగ్‌లోని బెంగాలీ తోలా ప్రాంతంలో నివసించే సుశీల త్రిపాఠి టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆమె కుమారుడు, అమిత్, జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నారు. అతను రెండు పిట్‌బుల్ మరియు లాబ్రడార్ కుక్కలను పెంచుతున్నాడు. మూడేళ్ల క్రితం బ్రౌనీ అనే పిట్‌బుల్ కుక్కను ఇంటికి తీసుకు వచ్చి పెంచుతున్నారు. ఈ క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సుశీల త్రిపాఠి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆమె పైన పడిన పిట్ బుల్ విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో ఆమె రక్తపుమడుగులో అక్కడే పడిపోయారు.

పిట్ బుల్ దాడితో రక్తపుమడుగులో యజమాని తల్లి .. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
జిమ్ ట్రైనర్ అయిన అమిత్ ఉదయం జిమ్ నుండి ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో అతను హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. రక్తం ఎక్కువగా పోవడంతో ఆమెను బలరాంపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఇక పెంపుడు కుక్క దాడిలో గాయపడిన యజమాని తల్లి చికిత్స పొందుతూ మృతి చెందింది.

మెడ నుండి పొత్తికడుపు దాకా 12 గాయాలు.. కాపాడలేకపోయిన పొరుగువారు
పోస్టుమార్టం నివేదిక ప్రకారం సుశీల శరీరంపై మెడ నుంచి పొత్తికడుపు వరకు మొత్తం 12 బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం, "ఉదయం 6 గంటల సమయంలో, కుక్కలు సుశీల పై దాడి చేయడంతో సుశీల సహాయం కోసం కేకలు వేశారు. అయితే వారు ఆమెను రక్షించడం కోసం ఆమె ఇంటికి పరుగులు తీసినప్పటికీ ఇంటికి లోపలి నుండి తాళం వేసి ఉండటంతో తాము ఏమీ చేయలేక పోయామని పేర్కొన్నారు. సుశీల త్రిపాఠి కుమారుడికి సమాచారం అందించగా, అతను ఇంటికి వచ్చేసరికే కుక్క మహిళను తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు చెబుతున్నారు.

కుక్కల సంరక్షణ కోసం లైసెన్స్.. పెంపకానికి అనేక రూల్స్
లక్నో మునిసిపల్ కార్పొరేషన్ (LMC) శ్వాన్ లైసెన్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బై-లా 2003 పేరుతో కుక్కల పెంపకం కోసం ఒక మాన్యువల్‌ను జారీ చేసింది. మాన్యువల్ ప్రకారం, కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు అనేక షరతులకు కట్టుబడి తప్పనిసరిగా లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా తన కుక్కను ఎవరికీ హాని కలిగించకుండా పొరుగువారికి ఎలాంటి అభ్యంతరం లేని విధంగా ఉంచి పెంచాలని మాన్యువల్‌లో పేర్కొంది.