దసరా ఉత్సవాల్లో దాడులకు పీఎఫ్ఐ భారీకుట్ర.. ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు టార్గెట్; వెలుగులోకి మరో సంచలనం!!
ఈడి మరియు ఎన్ఐఏ దాడులతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు సంబంధించి తీగలాగితే డొంక కదులుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పై దాడికి కుట్ర, ఉత్తరప్రదేశ్లో దాడులకు కుట్ర చేశారని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఈడి కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. దాడులకు వీరికి శిక్షణ ఇచ్చినట్టు పేర్కొంది. ఇక ఇదే క్రమంలో తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దసరా సందర్భంగా కూడా దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్రకు తెర తీసింది అని నిఘా వర్గాల దర్యాప్తులో వెల్లడైంది.

దసరా సందర్భంగా కుట్రకు స్కెచ్ వేసిన పీఎఫ్ఐ
వచ్చే నెల దసరా సందర్భంగా బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని వారి కదలికలను పర్యవేక్షించాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వర్గాలు తెలిపాయి. వీరి హిట్ లిస్టులో దర్యాప్తు సంస్థల అధికారులు కూడా ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పీఎఫ్‌ఐ సభ్యులు టెర్రర్ గ్రూపులతో కలిసి పనిచేస్తున్నారనే ఆరోపణలపై గత వారం దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది.

ఆర్ఎస్ఎస్ నాగపూర్ కార్యాలయంపై రెక్కీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లేదా ఆర్‌ఎస్‌ఎస్ యొక్క నాగ్‌పూర్ ప్రధాన కార్యాలయం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లక్ష్యాల జాబితాలో ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నాగపూర్ కార్యాలయంపై రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో దసరా సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు పీఎఫ్‌ఐ ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆ వర్గాలు తెలిపాయి. గత వారం 10 రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడుల్లో వందలాది మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులను అరెస్ట్ చేశారు. వారిలో 20 మంది మహారాష్ట్రకు చెందినవారు ఉన్నారు.

పిఎఫ్‌ఐని నిషేధించాలని హోం మంత్రిత్వ శాఖను కోరిన అస్సాం
గత వారం అస్సాంలో అరెస్ట్ అయిన అనేక మంది పిఎఫ్‌ఐ సభ్యులకు, టెర్రర్ గ్రూపులతో సంబంధాలున్నాయని ఆరోపణల నేపథ్యంలో పిఎఫ్‌ఐని నిషేధించాలని హోం మంత్రిత్వ శాఖను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పీఎఫ్‌ఐ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున ఒక్క రాష్ట్రం కూడా దానిపై పోరాడలేదని, అందుకే కేంద్రం దీనిని నిషేధించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కోరారు.

అస్సాం పోలీసుల అదుపులో కీలక పీఎఫ్ఐ నేత
కీలకమైన పిఎఫ్‌ఐ సభ్యుడు మినారుల్ షేక్, ప్రస్తుతం అస్సాం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతనిపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ మరియు అల్ ఖైదా మద్దతు ఉన్న టెర్రర్ సెల్‌ల మధ్య అనుమానాస్పద సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను సంస్థ కోసం నిధులను మళ్లించిన కీలకమైన పి ఎఫ్ ఐ సభ్యుడు. అతను 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల సమయంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క అస్సాం నాయకత్వానికి మార్గదర్శకత్వం వహించాడు.












Click it and Unblock the Notifications