షాకింగ్: బీహార్ లో మరోవంతెన చోరీచేసిన దొంగలు; నెలలో మూడోవంతెన మాయం
బీహార్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులకు పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతున్నారు. బీహార్ లో దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. వారు ఏకంగా బీహార్ రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న బ్రిడ్జిలను, వంతెనలను మాయం చేస్తూ పోలీసులకు షాక్ ఇస్తున్నారు. ఇటు ఇరిగేషన్ అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.

80 అడుగుల ఇనుప వంతెన చోరీ చేసిన దొంగలు
తాజాగా బీహార్ లో దొంగలు మరోసారి తమ ప్రతాపాన్ని చూపించారు. బీహార్‌లోని రోహ్తాస్, జహనాబాద్ జిల్లాల్లో రెండు వంతెనలు చోరీకి గురైన ఘటన జరిగి నెల రోజులు కూడా కాలేదు. కానీ తాజాగా బీహార్ రాష్ట్రంలోని మరో వంతెనను దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని బంకా జిల్లాలో చోటుచేసుకుంది. బంకా జిల్లా చందన్ బ్లాక్లో ఉన్న 80 అడుగుల ఇనుప వంతెన ఝాఝా పటనియా మధ్య 2004వ సంవత్సరంలో నిర్మించారు. 80 అడుగుల పొడవు 15 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ వంతెనను ప్రస్తుతం ఉపయోగించడం లేదు.

వంతెనను 70 శాతం మాయం చేసిన దొంగలు
కొత్తగా మరో రెండు వంతెనలు నిర్మించిన క్రమంలో ప్రజలు దీనిని వాడకపోవడంతో ఈ వంతెన పై దృష్టి పెట్టిన ఇనుము దొంగలు వంతెన చోరీకి పాల్పడ్డారు. దొంగలు 80 అడుగుల ఇనుప వంతెనను గ్యాస్ కట్టర్ల సహాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం 70 శాతం వంతెన మాయమైంది. ఇంకా 30 శాతం వంతెన మిగిలి ఉంది. స్థానికంగా ఉన్న వారు ఈ వంతెనను గ్యాస్ కట్టర్ లతో కట్ చేసి తొలగిస్తున్న వారిని ఇరిగేషన్ శాఖకు చెందిన వారేనని భావించి పెద్దగా పట్టించుకోకుండావదిలేశారు. దీంతో వంతెనను దొంగలు చోరీ చేయడం ఈజీ అయింది.

వంతెన కూల్చెయ్యటానికి గ్యాస్ కట్టర్లు
ఈ సంఘటనపై బంకా జిల్లా చందన్ బ్లాక్ బీడీఓ రాకేష్ కుమార్ మాట్లాడుతూ, వంతెనను కూల్చివేయడానికి గ్యాస్ కట్టర్లు ఉపయోగించబడ్డాయని పేర్కొన్నారు. బైద్యనాథ్ డ్యామ్ ఆలయానికి వెళ్లే కన్వారియా యాత్రికుల కోసం 2004లో నిర్మించిన ఇనుప మరియు ఉక్కు వంతెనలో 70 శాతం చోరీకి గురైందని ఆయన తెలిపారు. బీహార్‌లోని సుల్తాన్ గంజ్ నుండి జార్ఖండ్‌లోని డియోఘర్‌కు వెళ్లే కన్వారియాల రాకపోకలకు 45 లక్షల రూపాయల వ్యయంతో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో వంతెనను నిర్మించారని పేర్కొన్నారు.

బీహార్ లో వరుస వంతెన దొంగతనాలు..పోలీసులకు,ఇరిగేషన్ అధికారులకు తలనొప్పి
కొన్ని వారాల క్రితం, నలంద జిల్లాలోని జహనాబాద్‌ను బీహార్‌షరీఫ్‌ను కలిపే దర్ధా నదిపై ఉన్న రహదారి వంతెన దొంగిలించబడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో, బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల పనికిరాని ఇనుప వంతెనను పట్టపగలు దొంగల ముఠా, అధికారులుగా చెప్పి గ్రామస్థుల సహాయంతో దొంగిలించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులుగా నటించిన దొంగలు గ్యాస్ కట్టర్లు, ఎర్త్ మూవర్ మిషన్లతో వంతెనను కూల్చివేసి మూడు రోజుల్లో మెటల్‌ను ఎత్తుకెళ్లారు. ఇక వరుస వంతెన దొంగతనాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. అటు ఇరిగేషన్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చెక్ పెట్టటానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications