ప్రధాన కార్యదర్శిగా ఏచూరి..మరోసారి: పొలిట్‌బ్యురోలో దళిత నేత: సీపీఎం చరిత్రలోనే తొలిసారి
తిరువనంతపురం: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఎన్నిక కావడం వరుసగా మూడోసారి. కేరళలోని కన్నూర్‌లో నిర్వహించిన 23వ జాతీయ స్థాయి సదస్సు సందర్భంగా ఏచూరిని - పార్టీ ప్రధాన కార్యదర్శిగా పునర్నియమించారు. దీనితోపాటు- 17 మంది సభ్యులతో కూడిన పొలిట్‌బ్యూరో, 85 మందితో సెంట్రల్ కమిటీని సీపీఎం కాంగ్రెస్ ఎంపిక చేసింది. సెంట్రల్ కమిటీలో పలువురు కొత్తవారికి చోటు కల్పించింది.
ఇదివరకే సీతారాం ఏచూరి రెండు దఫాలుగా సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మరోసారి ఆయనకే అవకాశాన్ని ఇచ్చింది పార్టీ. 2024 నాటి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞుడైన ఏచూరికి ఈ కీలక పదవిలో పునర్నియమించింది. దేశంలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు కావడానికి అనుకూల వాతావరణం ఉండటం, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యాన్ని వహించే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య తెలుగువాడైన ఏచూరిని ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా- 17 మందితో ఏర్పాటు చేసిన పొలిట్‌బ్యురోలో ఓ దళిత నేతకు చోటు దక్కింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 58 సంవత్సరాల రామచంద్ర డోమ్‌ను పొలిట్‌బ్యురోలోకి తీసుకుంది సీపీఎం. పొలిట్‌బ్యురోలో ఓ దళిత నేతకు చోటు దక్కడం సీపీఎం చరిత్రలోనే ఇదే తొలిసారి. ఏడుసార్లు ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఏ విజయరాఘవన్, అశోక్ ధవాలె వంటి కీలక నేతలు పొలిట్‌బ్యురో జాబితాలో ఉన్నారు. 85 మందితో కూడిన సెంట్రల్ కమిటీలో 15 మంది మహిళలు చోటు లభించింది. అలాగే- 17 మంది కొత్తవారు ఈ కమిటీలో చేరారు.
సెంట్రల్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్ రామచంద్రన్ పిళ్లై, బిమన్ బోస్, హన్నన్ మొల్లా అపాయింట్ అయ్యారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ కార్యదర్శులు రాజేంద్ర సింగ్ నేగి, సంజయ్ పరాటె.. సెంట్రల్ కమిటీ శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగుతారు. ఇదే కమిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడు, కొత్తగా ఏర్పాటు చేసిన కంట్రోల్ కమిషన్ ఛైర్మన్‌గా ఏకే పద్మనాభన్‌ను సీపీఎం కాంగ్రెస్ నియమించింది. ఆయన పదవీ కాలం ఎంత అనేది ఇంకా నిర్దారించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications