ఉల్లి ధరలపై దద్దరిల్లిన లోక్‌సభ: తాను ఉల్లి ఎక్కువగా తిననంటూ నిర్మలా సెటైర్
న్యూఢిల్లీ: "అవును నేను ఉల్లిపాయలు ఎక్కువగా తినను. నేను అలాంటి కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి నేను పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు" ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బుధవారం పెరుగుతున్న ఉల్లి ధరలపై లోక్‌సభ దద్దరిల్లింది. దీనిపై మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఉల్లి ధరలు కొండెక్కి కూర్చుంటున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ మార్కెట్లలో ఉల్లి ధర ఎంతో తెలుసా..?మరింత ప్రియం కానున్న కిచెన్ కింగ్

మా కుటుంబం ఉల్లికి వెల్లుల్లికి దూరం
ఉల్లి ధరల ఘాటు పార్లమెంటును తాకింది. లోక్‌సభలో పెరుగుతున్న ఉల్లి ధరలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పెరుగుతున్న ధరలపై మాట్లాడిని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు. తన కుటుంబం ఉల్లిపాయలకు, వెల్లుల్లికి దూరమని చెప్పుకొచ్చారు. ఓ వైపు నిర్మలా సీతారామన్ సమాధానం సభలో నవ్వులు పూయించగా మరోవైపు విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎక్కువ ఉల్లిపాయలు తినడంతో కోపోద్రిక్తులు అవుతారని మరో సభ్యుడు చెప్పగా సభ మరో సారి గొల్లుమంది.

ఉల్లి నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభకు వివరిస్తున్న సమయంలో పై విధంగా ఆమె వ్యాఖ్యానించారు. ఉల్లి ధరల నియంత్రణకు భారత్ నుంచి ఉల్లి ఎగుమతులపై నిషేధం, స్టాక్‌లో ఉంచడం, బయటి దేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకోవడం, ఉల్లి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ స్టాక్ ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని సభకు తెలిపారు నిర్మలా సీతారామన్. ప్రత్యక్ష బదిలీ ద్వారా లబ్ది చేకూరేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే దళారీలు లేదా మధ్యవర్తులు అనే వారు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కోల్‌కతాలో కిలో ఉల్లి రూ.150
ప్రస్తుతం కోల్‌కతాలో కిలో ఉల్లి రూ.150 పలుకుతుండగా ఇదే విషయంపై సభలో రచ్చ జరిగింది. పార్లమెంటు బయట కూడా విపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. ఇక ఉల్లిపాయలు రవాణా చేస్తున్న సమయంలో అవి చోరీకి గురవుతున్నాయనే విషయాన్ని కూడా సభలో విపక్షాలు ప్రస్తావించాయి. మరోవైపు మధ్యప్రదేశ్ మందసౌర్‌కు చెందిన రైతు వద్ద ఉన్న రూ.30వేలు విలువ చేసే ఉల్లిపాయలను చోరీ చేశారని ఫిర్యాదు చేశాడు. ఇక తాము పండించిన ఉల్లి పంటను కాపాడుకునేందుకు రాత్రంతా తమ పొలాల వద్ద రైతులు కాపలా కాస్తున్నారు.

ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం జారుకుంటోంది
కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరీ ఉల్లి ధరల పెంపును ప్రస్తావించడం వాటిని నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా దీనిపై నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి జమ్మూ కశ్మీర్, రైతు సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా జారుకుంటోందని అధిర్ రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. పార్లమెంటులో పెరుగుతున్న ఉల్లి ధరల గురించి ప్రశ్నించగా అదేదో తమాషా చేసి టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు అధిర్.