కరోనా పోస్టులపై యోగీ సర్కార్ ఉక్కుపాదం- అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. యూపీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో రోగులకు ఆక్సిజన్, కోవిడ్ చికిత్స దొరక్క అల్లాడుతున్నారు. దీంతో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ నిర్లక్ష్యంపై సోషల్ మీడియా హోరెత్తుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోవిడ్ బాధితులు పెడుతున్న పోస్టులతో యోగీ సర్కార్ ఇరుకునపడుతోంది. దీంతో సోషల్ మీడియా పోస్టులపై యోగీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది.
సోషల్ మీడియాలో ఆక్సిజన్, కోవిడ్ చికిత్స కోసం సాయం కోరుతూ పోస్టులు పెడుతున్న వారిపై యోగీ సర్కార్ కేసులు పెట్టడాన్ని తప్పుబడుతూ అలబాహాద్ హైకోర్టులో సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే పిటిషన్ దాఖలు చేశారు. కోవిడ్ రోగులకు, వారి కుటుంబాలకు ఆక్సిజన్, చికిత్సపై సమాచారాన్ని సేకరించి సహాయం చేస్తున్న స్వతంత్ర వాలంటీర్లను రక్షించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.
ఆక్సిజన్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై యోగీ సర్కార్ క్రిమినల్ కేసులు పెట్టడం అధికార దుర్వినియోగమేనని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తాజాగా అమేథీతో తన తాతకు ఆక్సిజన్ కోరుతూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టిన ఓ యువకుడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టడాన్ని సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే తప్పుబట్టారు. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం కల్పించిన భావస్వాతంత్ర, వాక్ స్వాతంత్ర హక్కులను పోలీసుల చర్యలు హరించేలా ఉన్నాయని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ఆక్సిజన్ కోరుతున్న కోవిడ్ కుటుంబాలను బెదిరింపులకు గురిచేసేలా పోలీసుల చర్యలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు తాజాగా వర్చువల్ ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఎం యోగీ.. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, దీనిపై పుకార్లు వ్యాపింపజేసే వారిపై ఎన్ఐఏ కేసులు పెడతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications