నేను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నానట: బీహార్ సిఎం జితన్ రామ్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తన కేబినెట్ మంత్రులపై పలు ఆరోపణలు చేశారు. తాను ప్రజలకు అందిస్తున్న సేవలు, తన సామర్థ్యంపై తన కేబినెట్‌లోని మంత్రులకు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. తన సామర్థ్యాన్ని కొందరు తక్కువగా అంచనా వేస్తున్నారని చెప్పారు. పాట్నాలో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
‘కొందరు మంత్రులు నేను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నానని గుసగుసలాడుకుంటున్నారు. మరికొందరు నేను వన్డే ఇంటర్నేషనల్ ఆడుతున్నానని అంటున్నారు. ఇంకొందరు మంత్రులు నేను ట్వంటి20 ఆడుతున్నానని అంటున్నారు. అయితే నేను ప్రజలకు సేవ చేసేందుకు, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏ క్రికెట్ అయినా ఆడతాను' అని జితన్ రామ్ మాంఝీ తెలిపారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చగలమన్న సత్యాన్ని జీర్ణం చేసుకోవాలని మంత్రివర్గ సహచరులకు ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, అత్యంత వెనకబడిన కులాలకు చెందిన కాంట్రాక్టర్లు రూ. 50 లక్షల వరకు విలువైన పనులను టెండర్లు లేకుండా దక్కించుకోవచ్చని ప్రకటించానని, అయితే కొందరు మంత్రులు ఈ ప్రకటనను జీర్ణించుకోలేకపోతున్నారని జితన్ రామ్ మాంఝీ తెలిపారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తోపాటు జెడియు సీనియర్ నేతలు మాంఝీ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో తనకు తెలియదని, తనకు తెలియని విషయంపై స్పందించే వ్యక్తిని కాదని నితీష్ కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తాను స్పందించలేనని మరో జెడియు సీనియర్ నేత బషిష్ఠ నారాయణ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications