సీబీఐ చేతికి మరో కీలక కేసు అప్పగింత..
పనాజీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారతీయ జనత పార్టీ నాయకురాలు సొనాలి ఫోగట్ అనుమానాస్పద మృతి కేసు మరో లుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు నుంచి గోవా పోలీసులు తప్పుకొన్నారు. ఇకపై దీని విచారణను కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు చేపట్టనున్నారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తోండటంతో ఈ నిర్ణయం తీసుకుంది గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.
హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు సొనాలీ ఫొగట్ కిందటి నెల 23వ తేదీన గోవాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఉన్న సొనాలీని నార్త్ గోవాలోని అంజున ప్రాంతంలోని సెయింట్ ఆంథోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గుండెపోటుతో మరణించి ఉండొచ్చంటూ ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం దిగ్భ్రాంతికర వివరాలు వెల్లడయ్యాయి. సొనాలి ఫోగట్ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు తేలింది.

అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల మరణించినట్లు తేలింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరని అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. వారిద్దరినీ ప్రధాన నిందితులుగా భావిస్తోన్నారు. ఆమె వ్యక్తిగత సహాయకులు సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ సింగ్, రెస్టారెంట్ ఓనర్ ఎడ్విన్ న్యూన్స్, డ్రగ్ పెడ్లర్‌గా భావిస్తోన్న దత్త ప్రసాద్, రామ్‌దాస్ మంద్రేకర్ అరెస్ట్ అయ్యారు. సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ సింగ్‌పై హత్య కేసు నమోదు చేశారు గోవా పోలీసులు.
ఈ కోణంలోనే పోలీసులు ఛార్జ్‌షీట్ నమోదు చేసినట్లు నార్త్ గోవా పోలీస్ సూపరింటెండెంట్ శోభిత్ సక్సేనా తెలిపారు. తాజాగా ఈ కేసును సీబీఐకి బదలాయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. ఈ కేసును సీబీఐకి బదలాయించాలంటూ సొనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తోన్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
సొనాలి ఫోగట్ కేసును సీబీఐకి బదలాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని వచ్చేలా ఆమె సొంత రాష్ట్రం హర్యానాలోని సర్వ జాతీయ ఖాఫ్ మహా పంచాయత్.. ఆదివారం నాడు ఓ తీర్మానాన్ని చేసింది. ఇందులో ఫొగట్ కుమార్తె యశోధర, ఇతర కుటుంబ సభ్యులూ పాల్గొన్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన మరుసటి రోజే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గోవా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తోన్నారని, ఇక సీబీఐ తన చేతికి తీసుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications