మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, బాబు
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సోమవారంనాడు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు వారు మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 11 గంటలకు నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో టిడిపికి పదవులు కేటాయించే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

కాగా, మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వారణాసి నుంచి 19మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్య మనవడు గిరిధర్ మాలవ్య కూడా ఉన్నారు.
వారణాసిలో మోడీ నామినేషన్ దాఖలు చేసినప్పుడు గిరిధర్ మాలవ్య ప్రతిపాదించారు. మిగిలిన ప్రతిపాదకులు పండిట్ చానులాల్, వీరభద్ర మాంజి, అశోక్ బుంఖర్‌లకు కూడా ఆహ్వానాలు అందాయి.
హాజరుకానున్న ఎనిమిది దేశాల ప్రతినిధులు
మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎనిమిది దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాల ప్రతినిధులు ఖరారు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్, శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష, భూటాన్ ప్రధాని షెరింగ్ టాబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, బంగ్లాదేశ్ పార్లమెంటు స్పీకర్ శిరిన్ షర్మీన్ చౌధురి హాజరవుతున్నట్లు తెలిపింది. వీరితోపాటు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ కూడా హాజరవుతారు.












Click it and Unblock the Notifications