వైభవ్‌కు నో ఛాన్స్.. టాలెంట్‌కు రూల్స్ అడ్డొచ్చినయా?
IND vs IRE: భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ తుది జట్టు జాబితా బయటకు రాగానే అభిమానుల ఉత్సాహం కాస్తా నిరాశగా, ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఐపీఎల్‌లో 776 పరుగులు, 72 సిక్సర్లతో పాటు రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్‌లతో ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి కనీసం తుది జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. టీమిండియాలో కేవలం అద్భుత ప్రదర్శన ఇస్తే సరిపోదా? లేక ఎంతటి అసాధారణ ప్రతిభ ఉన్నా సరే సీనియారిటీ ప్రకారం తమ వంతు వచ్చే వరకు బెంచ్‌కే పరిమితం కావాలా? అనే చర్చ మొదలైంది.
అభిషేక్, సంజూల పోటీ
ప్రస్తుత టీమిండియాలో ఆటగాళ్ల ఎంపిక అనేది కేవలం ప్రతిభ లేదా ప్రస్తుత ఫామ్‌పై మాత్రమే ఆధారపడి ఉండటం లేదు. జట్టు సమతుల్యత, ప్లేయర్ల పాత్ర, సీనియర్ల ఫామ్, డ్రెస్సింగ్ రూమ్ నిలకడ వంటి అనేక సమీకరణాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఓపెనర్లు జట్టులో ఉన్నప్పుడు, వైభవ్ సూర్యవంశీకి నేరుగా తుది జట్టులోకి రావడం అంత సులువు కాదు. కేవలం ఓ కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వడం కోసం, జట్టు కోసం నిలకడగా పరుగులు చేస్తున్న సీనియర్ బ్యాటర్లను పక్కన పెట్టడం సమంజసం కాదని జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ యాజమాన్య వైఖరిని స్పష్టం చేశారు. అయితే 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొని, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఇలాంటి అరుదైన ప్రతిభావంతుల కోసం నిబంధనలలో మినహాయింపులు ఉండకూడదా? అనేదే అభిమానుల ప్రశ్న.

అవకాశం లేనప్పుడు స్క్వాడ్‌లోకి ఎందుకు తీసుకున్నట్లు?
ఇక్కడ అందరినీ బాధిస్తున్న ప్రశ్న ఏమిటంటే.. ఓపెనర్లు ఇద్దరూ పూర్తి ఫిట్‌గా ఉన్నారని, వారి స్థానాలకు ఎలాంటి ఢోకా లేదని తెలిసినప్పుడు వైభవ్ సూర్యవంశీని అసలు 15 మంది సభ్యుల స్క్వాడ్‌లోకి ఎందుకు ఎంపిక చేశారు? కేవలం జట్టు వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికా? నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడానికా? లేక విదేశీ పర్యటనల అనుభవం కోసమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువ ఆటగాడి ఎదుగుదలకు ఇవన్నీ అవసరమే అయినప్పటికీ.. దేశమంతా అతడి అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, కేవలం 'అనుభవం' అనే సాకుతో బెంచ్‌పై కూర్చోబెట్టడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అనుభవానికి నిజమైన వేదిక డ్రెస్సింగ్ రూమ్ కాదు, మ్యాచ్ జరిగే మైదానం మాత్రమే.
ధోనీ కోసం ఆనాడు మారిన రూల్స్!
అద్భుతమైన టాలెంట్ కోసం సెలెక్టర్లు తమ పాత నిబంధనలను పక్కన పెట్టడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కాదు. దీనికి మహేంద్ర సింగ్ ధోనీనే అతిపెద్ద ఉదాహరణ. ధోనీ మొదట బీసీసీఐ "ప్రతిభా పరిశోధన, అభివృద్ధి (TRDW)" కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ సమయంలో ఆ ప్రోగ్రామ్‌లో చేరడానికి గరిష్ట వయసు 19 ఏళ్లు మాత్రమే. కానీ ధోనీకి అప్పటికే 21 ఏళ్లు నిండాయి. నిబంధనల ప్రకారం ధోనీ దానికి అర్హుడు కాదు. కానీ జంషెడ్‌పూర్‌లో ధోనీ సిక్సర్ల విధ్వంసాన్ని చూసిన మాజీ బెంగాల్ కెప్టెన్ ప్రకాష్ పొద్దార్.. ఈ ఆటగాడికి వయసు నిబంధనలు అడ్డుకాకూడదని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌కు సూచించారు. వెంగ్‌సర్కార్ కూడా ప్రతిభను గుర్తించి నిబంధనలను సడలించి ధోనీని చేర్చుకున్నారు. ఆ తర్వాత ధోనీ భారత క్రికెట్ చరిత్రను ఎలా మార్చాడో అందరికీ తెలిసిందే.
టాలెంట్‌కు ట్రీట్‌మెంట్ దక్కాల్సిందేనా?
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తమ టాలెంట్‌తోనే జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నారు, కాబట్టి వారిని కేవలం పాపులారిటీ ఆధారంగా తొలగించడం తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. కానీ కొన్నిసార్లు వర్తమానంతో పాటు భవిష్యత్తును కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ సెలెక్టర్లు వైభవ్‌ను భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తే, అతడిని కేవలం బెంచ్‌కే పరిమితం చేయకుండా సరైన సమయంలో నమ్మకం ఉంచి మైదానంలోకి దించాలి. గొప్ప ఆటగాళ్లు కేవలం ప్రదర్శనతోనే అవ్వరు, వారిలోని ప్రతిభను సరైన సమయంలో గుర్తించి యాజమాన్యం తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాల వల్లే చరిత్ర సృష్టించబడుతుంది. మరి వైభవ్ సూర్యవంశీ విషయంలో భారత క్రికెట్ ఎలాంటి చరిత్రను రాయబోతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications