West Bengal Polls: తృణమూల్ కంచుకోటలో బీజేపీ సీట్ల పోరాటం ? వెంటాడుతున్న గతం..!
పశ్చిమ బెంగాల్లో రేపు రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (West Bengal Second Phase Polls) కు సర్వం సిద్దమైంది. నిన్నటితో రెండో దశ ఎన్నికలు జరిగే 142 సీట్లలో ప్రచార పర్వం ముగిసింది. ఈ సీట్లన్నీ దక్షిణ బెంగాల్ (South Bengal) పరిధిలోనే ఉన్నాయి. ఈ భాగం అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు కంచు కోటగా ఉంది. అలాగే మైనార్టీ ఓట్ల ప్రభావం కూడా ఎక్కువే. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల సవరణ ప్రభావం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది. దీంతో బీజేపీ (BJP)కి రేపటి ఎన్నికలు పెను సవాల్ విసురుతున్నాయనే అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బెంగాల్లో రెండో దశ ఎన్నికలపై ఎన్జీటీవీ చర్చలో పలు కీలక అంశాల్ని నిపుణులు ప్రస్తావించారు. వీటిలో ప్రధానంగా గత మూడు ఎన్నికల గణాంకాలను బట్టి చూస్తే, బీజేపీకి దక్షిణ బెంగాల్లో గెలుపు కష్టంగా ఉండవచ్చని తెలుస్తోంది. బెంగాల్‌లో 294 అసెంబ్లీ సీట్లు ఉండగా, మెజారిటీ మార్క్ 148గా ఉంది. 2021లో వీటిలో తృణమూల్ 215 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు రెండో దశలో పోలింగ్‌కు వెళ్తున్న 142 సీట్లలో 2021 అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ 123, బీజేపీ 18 సీట్లు గెలుచుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలోనూ అసెంబ్లీ సీట్ల పరంగా చూస్తే తృణమూల్ 105 సీట్లు, బీజేపీ 37 సీట్లు గెలుచుకున్నాయి. ఐదేళ్ల తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలు చూసినా తృణమూల్ స్కోరు 115, బీజేపీ స్కోరు 27 గానే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో ఎన్నికల ఫలితాల్ని అంచనా వేయవచ్చు.

రెండో దశ పోలింగ్ జరిగే 142 సీట్లలో బీజేపీ ఎన్నడూ గెలవని సీట్లు 102. తొలి దశలో ఈ సంఖ్య 50గా ఉంది. అలాగే ఓటర్ల జాబితా సవరణలో తొలగించిన ఓట్ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉందని చెప్తున్నారు. రెండో దశలో పోలింగ్‌కు వెళ్లే ప్రాంతాల్లోని ఎస్ఐఆర్ ప్రభావిత సీట్లు మొదటి దశతో పోలిస్తే రెట్టింపుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన నియోజకవర్గాల సంఖ్య తృణమూల్ కాంగ్రెస్ గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉంది . ఈ విషయం అధికార పార్టీని కలవరపెడుతోంది. దీంతో ఉద్దేశపూర్వకంగా అవకతవకలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ దశలో బీజేపీ అవకాశాలను తగ్గించే అంశం మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లోని 53 సీట్లేనని ఎన్నికల విశ్లేషకుడు అమితాబ్ తివారీ తెలిపారు. బెంగాల్ లో మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.














Click it and Unblock the Notifications