ఆపరేషన్ 7.. వారంలో ఏడుగురు ఎంపీలు ఔట్.. బీజేపీ ప్లాన్ అదిరందయ్యో!
ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో ఈ వారం ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. కేవలం 7 రోజుల్లోనే పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురు పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీనిని ఓ పక్కా వ్యూహం ప్రకారం జరిగిన రాజకీయ ఆపరేషన్‌గా భావిస్తున్నారు. ఈ పరిణామంతో రాజ్యసభలో బీజేపీ బలం ఒక్కసారిగా పెరగడమే కాకుండా.. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు చోటుచేసుకుంది. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ వంటి కీలక నేతలు కూడా అరవింద్ కేజ్రీవాల్‌కు హ్యాండ్ ఇవ్వడం గమనార్హం.
ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు వ్యూహం బుధవారం (ఏప్రిల్ 22) నుంచే మొదలైంది. తన ఎంపీలు చేజారిపోతున్నారని గ్రహించిన అరవింద్ కేజ్రీవాల్.. వారిని బుజ్జగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు ఎంపీలు ఫోన్లు ఎత్తకపోగా.. మరికొందరు అస్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ వ్యూహకర్త సందీప్ పాఠక్ చివరి నిమిషం వరకు తాను కేజ్రీవాల్‌తోనే ఉంటానని నమ్మించి.. శుక్రవారం మధ్యాహ్నం నేరుగా బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్ షా బెంగాల్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోమవారం జరగాల్సిన ఈ 'విలీనం'.. కేజ్రీవాల్‌కు విషయం తెలిసిపోవడంతో ముందుగానే శుక్రవారం ముగించేశారు.

ఈ ఆపరేషన్‌లో కీలక పాత్రధారులు వీరే:
రాఘవ్ చద్దా: ఈ మొత్తం ఆపరేషన్‌కు ఈయనే 'ఫీల్డ్ కమాండర్' అని టాక్. లిక్కర్ స్కామ్ తర్వాత పార్టీకి దూరంగా ఉన్న రాఘవ్ చద్దా.. లండన్‌లో కంటి ఆపరేషన్ చేయించుకున్న సమయంలోనే బీజేపీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
సందీప్ పాఠక్: పంజాబ్‌లో ఆప్ అఖండ విజయం వెనుక ఉన్న అసలు మేధావి ఈయన. చివరి నిమిషం వరకు కేజ్రీవాల్‌కు విధేయుడిగా నమ్మించి మోసం చేయడం పార్టీకి పెద్ద దెబ్బ.
హర్భజన్ సింగ్: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. గతంలోనే బీసీసీఐ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ తర్వాతే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
పారిశ్రామికవేత్తలు: రాజిందర్ గుప్తా, విక్రమ్‌జీత్ సాహ్నీ, అశోక్ మిట్టల్ వంటి వ్యాపారవేత్తలకు కేంద్రంతో విభేదించడం ఇష్టం లేక, తమ వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా బీజేపీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అశోక్ మిట్టల్ విద్యాసంస్థలపై ఈడీ దాడులు జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడింది.
ఈ పరిణామంతో రాజ్యసభలో బీజేపీ బలం 113కు చేరింది. ఎన్డీయే కూటమికి మొదటిసారిగా ఎగువ సభలో సాధారణ మెజారిటీ లభించింది. దీనివల్ల 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' వంటి కీలక బిల్లులను పాస్ చేయించుకోవడానికి కేంద్రానికి ఇకపై ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం లేదు. మరోవైపు ఆప్ దగ్గర ఇప్పుడు కేవలం ముగ్గురు ఎంపీలు (సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, బల్బీర్ సింగ్ సీచెవాల్) మాత్రమే మిగిలారు. దీనిని పంజాబీలకు జరిగిన ద్రోహంగా కేజ్రీవాల్ అభివర్ణించినప్పటికీ.. 2027 పంజాబ్ మిషన్ కోసం బీజేపీ తన అసలు ఆటను మొదలుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications