అఖిలేష్ యాదవ్ రాజీనామా: మరో సీనియర్ నేత కూడా: యూపీలో కీలక పరిణామాలు
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలోకి వస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజ్‌వాది పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. వరుసగా మరో విడత కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. 403 స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించింది. 2017 నాటి ఎన్నికలతో పోల్చుకుంటే సీట్ల సంఖ్య తగ్గినా- సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 255 స్థానాలు లభించాయి. సమాజ్‌వాది పార్టీ 111 సీట్లకు పరిమితమైంది. ఇదివరకటితో పోల్చుకుంటే ఈ విడత తన సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోగలిగిందే తప్ప అధికారానికి ఆమడదూరంలో నిలిచింది. ఈ పరిణామాల మధ్య సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు.

లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా..
ఇందులో భాగంగా అఖిలేష్ యాదవ్.. తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యేగా కొనసాగనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు అఖిలేష్. సమాజ్‌వాది పార్టికే చెందిన సీనియర్ నాయకుడు ఆజంఖాన్ కూడా తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటించారు.

ఆజంగఢ్ నుంచి..
2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్.. ఆజంగఢ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2,59,874 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని మట్టి కరిపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి 67,504 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీ తరఫున పోటీ చేసిన కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్‌ను ఓడించారు. ప్రతిపక్ష స్థానానికే పరిమతం కావడం, శాసనసభలో ప్రతిపక్ష నేతగా అఖిలేష్ యాదవ్ ఎన్నికకావడం వంటి పరిణామాల మధ్య ఆయన తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆజంఖాన్ కూడా..
కాగా- సమాజ్‌వాది పార్టీకే చెందిన మరో సీనియర్ నాయకుడు ఆజంఖాన్ కూడా తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన లోక్‌సభలో రామ్‌పూర్ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రామ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. వారిద్దరి రాజీనామాల వల్ల ఆజంగఢ్, రామ్‌పూర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది.












Click it and Unblock the Notifications