అయోధ్య ఆలయంలో తొలి శ్రీరామ నవమి.. అయోధ్యకు రావద్దని ట్రస్ట్ విజ్ఞప్తి.. ఎందుకంటే
దేశమంతా శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. ఈనెల 17వ తేదీన శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్న నేపథ్యంలో, అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముడు కొలువైన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి సందర్భంగా భక్తులు భారీగా అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది.
అయోధ్యకు రావద్దు
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో జరిగే వేడుకలను ఇంటి వద్దనే ఉండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాలని, ఎవరు శ్రీరామనవమి వేడుకలను చూసేందుకు అయోధ్యకు రావద్దని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సూచించింది. శ్రీరామ నవమి నాడు అయోధ్యలో జరిగే పూజాది కార్యక్రమాలను, హారతిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.

ప్రత్యక్ష ప్రసారంలో ఆన్ లైన్లో దర్శించుకోండి
అయోధ్యలో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లోనే అందరూ బలరాముడిని దర్శించుకోవాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సూచించింది. ఉత్సవాలు ముగిసిన తర్వాత, భక్తుల రద్దీ తగ్గిన తర్వాత భక్తులు అయోధ్యకు రావచ్చని, ఇక్కడకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేసింది.
అయోధ్యలో రామాలయంలో తొలి రామనవమి.. భక్తుల రద్దీ అంచనా ఇదే
ఆలయం నిర్మించిన తర్వాత తొలిసారి ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో శ్రీరామనవమి రోజు దాదాపు 5 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉందని ట్రస్ట్ అంచనా వేస్తుంది. ఇక ఇప్పటికే అయోధ్యలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బాలరాముడి దర్శనం, హారతి వేళల్లో పలు మార్పులు చేసింది.
నవమి దృష్ట్యా ఆ దర్శనాలు రద్దు
గర్భాలయంలో దర్శనాలు రాత్రి11:00 వరకు వరకు కొనసాగుతాయని, మధ్య మధ్యలో సేవలకు గాను రేపు భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. ఇక శ్రీరామనవమి దృష్ట్యా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలను, వీఐపీ పాసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications