టోల్ కట్టొద్దు... కుమారస్వామి సంచలన నిర్ణయం, 10 రోజుల డెడ్‌లైన్!
సిలికాన్ సిటీ బెంగళూరులో నైస్ రోడ్డు (NICE Road) పేరిట జరుగుతున్న టోల్ వసూళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి విరుచుకుపడ్డారు. టోల్ రూపంలో అమాయక ప్రజల జేబులను దోచుకోవడాన్ని తక్షణమే ఆపేయాలని, ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ఒక్క రూపాయి కూడా టోల్ చెల్లించవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ అక్రమ టోల్ దందాకు తెరదించేందుకు కర్ణాటక ప్రభుత్వానికి 10 రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోగా చర్యలు తీసుకోకపోతే తామే నేరుగా మైదానంలోకి దిగి నిరసనలతో రోడ్డును దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
బెంగళూరు-మైసూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు అమలులో భారీగా అక్రమాలు జరిగాయని, ఇది రాష్ట్రంలోనే అత్యంత పెద్ద స్కామ్‌లలో ఒకటిగా కనిపిస్తోందని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్ట్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు స్వతంత్ర నిపుణుల బృందంతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు వ్యాఖ్యలను ఉటంకిస్తూ కుమారస్వామి మాట్లాడారు. కోర్టు అంత తీవ్రంగా స్పందించినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రాజెక్టును ప్రభుత్వం తక్షణమే తన ఆధీనంలోకి తీసుకుని, చట్టవిరుద్ధంగా జరుగుతున్న టోల్ రాబడిని ఆపేయాలని డిమాండ్ చేశారు.

బిడాడి ప్రాజెక్టుపైనా పోరాటం... బీజేపీతో కలిసి అసెంబ్లీలో రచ్చ
ఈ క్రమంలో కేవలం నైస్ రోడ్డు టోల్ మాత్రమే కాకుండా, ప్రభుత్వం ప్రతిపాదించిన ఏఐ బీడాడీ టౌన్‌షిప్ ప్రాజెక్టును కూడా తాము తీవ్రంగా నిరసిస్తున్నామని కుమారస్వామి తెలిపారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అసెంబ్లీ వేదికగా గళమెత్తాలని జేడీఎస్, బీజేపీ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచే లాలూచీలు, మోసాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్న తీరును ఎండగడతామని స్పష్టం చేశారు.
ప్రతిపక్షంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ సర్కార్
కుమారస్వామి కామెంట్స్‌పై కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖార్గే తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై టోల్ చార్జీలు పెంచినప్పుడు నోరు మెదపని నాయకులు, ఇక్కడ మాత్రం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో ఛార్జీలు స్వల్పంగా పెరిగినా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే ప్రతిపక్ష నేతలు, దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ భారానికి ఎవరు బాధ్యులో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ పరస్పర ఆరోపణలతో కర్ణాటక రాజకీయాల్లో నైస్ రోడ్డు అంశం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది.




Click it and Unblock the Notifications