
యూపీలో వింతశిశువు జననం; 4కాళ్ళు, 4చేతులతో శిశువు; దేవతా ప్రతిరూపమంటున్న స్థానికులు
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత శిశువు జన్మించింది. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ లో ఓ మహిళ ప్రసవించిన బిడ్డ నాలుగు చేతులు నాలుగు కాళ్లతో ఉండడం స్థానికంగా ఉన్న ప్రజలను విస్మయానికి గురి చేసింది. నాలుగు కాళ్ళు నాలుగు చేతులతో పుట్టిన బిడ్డను చూడడానికి ఆసుపత్రిలో జనం గుమిగూడారు. ఇదెక్కడి విచిత్రం అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక డాక్టర్లు సైతం ఆ వింత శిశువును చూసి షాక్ అయ్యారు.

యూపీలో వింత శిశువు జననం
హర్దోయ్ లోని షహాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కరీనా అనే మహిళ గత వారం పాపకు జన్మనిచ్చింది . జూలై 2వ తేదీన ఆమె ప్రసవ నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అదేరోజు ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. నార్మల్ డెలివరీ కాకపోవటంతో సిజేరియన్ చేశారు. అయితే అంతకు ముందు స్కానింగ్ చేసిన వైద్యులు కవల పిల్లలు ఉన్నట్టు భావించారు. కానీ తీరా డెలివరీ చేసిన తర్వాత ఖంగు తిన్నారు. ఇక చిన్నారి నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో పుట్టడంతో చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి వైద్యులు షహాబాద్ నుంచి హర్దోయ్ కి, ఆపై లక్నోకు పంపించారు.

కవలపిల్లలు పుట్టాల్సి ఉన్నా ఒక శిశువు ఎదగకపోవటంతోనే ఇలా
పుట్టిన నవజాత శిశువు కడుపుకు అదనపు చేతులు మరియు కాళ్లు అతుక్కుని ఉన్నట్టు గుర్తించిన క్రమంలో ఇక ఈ ఘటనపై వైద్యాధికారి వివరాలు వెల్లడిస్తూ ఇది కవలల కేసు అని, మరో చిన్నారి కూడా పూర్తిగా ఎదగాల్సి ఉన్నా ఎదగలేదని, ఫలితంగా శిశువు నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో జన్మించిందని తెలిపారు. ఇదిలా ఉంటే జనవరి 17వ తేదీన బీహార్లోని కతిహార్ లో కూడా ఇదే తరహాలో నాలుగు చేతులు నాలుగు కాళ్లతో ఒక చిన్నారి జన్మించింది. అంతకుముందు డిసెంబర్ 2021 లో కూడా మూడు చేతులు మూడు కాళ్లతో బిడ్డ జన్మించాడు.

దేవతా ప్రతిరూపంగా చెప్పుకుంటున్న స్థానికులు
అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా ప్రజలు వారిని దేవతా ప్రతిరూపాలుగా అభివర్ణించడం ప్రధానంగా కనిపిస్తుంది. గతంలోనూ నాలుగు చేతులు, కాళ్లతో పుట్టిన బిడ్డను దేవత అవతారంగా భావించిన స్థానికులు పూజలు చేశారు. ఇక తాజాగా పుట్టిన నాలుగు కాళ్ళు నాలుగు చేతుల శిశువును దేవతకు ప్రతిరూపమని చెప్పుకుంటున్నారు. ఇక తన బిడ్డ వింత పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు బిడ్డ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.