అందులో నిజం లేదు.. ఈ చర్యలు తీసుకోండి.. కరోనాపై సీఎంకు సుధామూర్తి కీలక లేఖ..
కర్ణాటకలోని కలబుర్గికి చెందిన సిద్దిఖీ(76) కరోనా వైరస్ సోకి మృతి చెందడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రి యడియూరప్పకు లేఖ రాశారు. ఎయిర్ కండిషన్(ఏసీ) ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉండటంతో మాల్స్,థియేటర్స్ మూసివేయాలని విజ్ఞప్తి చేశారు.

అందులో నిజం లేదు..
రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు,కాలేజీలు కూడా తక్షణమే మూసివేయాలని సుధామూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలైన ఫార్మసీ,కిరాణ,పెట్రోల్ బంక్‌లు మాత్రమే తెరిచే ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నారాయణ హెల్త్ ఛైర్మన్&ఎగ్జిక్యూటివ్ దేవీ ప్రసాద్ శెట్టితోనూ చర్చించినట్టు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశాల్లో వైరస్ చనిపోతుందన్న దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. ఆస్ట్రేలియా,సింగపూర్ లాంటి దేశాల్లో ఏడాది పొడవునా 12 నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని.. అలాంటి దేశాల్లోనే కరోనా వ్యాప్తి చెందుతోందని గుర్తుచేశారు.

ప్రత్యేక ఆసుపత్రి నిర్మించాలన్న సుధామూర్తి
సుధామూర్తి చేసిన మరో కీలక విజ్ఞప్తి ఏంటంటే.. కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తే.. ఏ ప్రైవేట్ ఆసుపత్రి ఆ కేసులను డీల్ చేయలేదన్నారు. కాబట్టి ఏదైనా ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఖాళీ చేయించి.. 500-700 పడకలతో కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ ఆక్సిజన్ లైన్స్&పైప్స్ అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సిద్దంగా ఉందని తెలిపారు. వైద్య పరికరాలు,మౌలిక వసతుల విషయంలో సహాయానికి హెల్త్ ఛైర్మన్&ఎగ్జిక్యూటివ్ దేవీ శెట్టి ఒప్పుకున్నారని చెప్పారు.

స్కూళ్లు,కాలేజీలు మూసివేత..
కరోనా వైరస్ కారణంగా దేశంలోనే తొలి మరణం కర్ణాటకలో సంభవించడంతో అక్కడి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే స్కూళ్లు,కాలేజీలను మూసివేయాలని ఆదేశించింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మార్చి 23 తర్వాతే పరీక్షలు ఉంటాయని.. అప్పటివరకు స్కూల్స్ ఉండవని తెలిపారు. ఐటీ సంస్థలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పెళ్లిళ్లు,ఇతర పెద్ద కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని కోరింది. అటు కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో ఇప్పటివరకు 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.