ఐఎస్ఐతో లింక్‌లు: కాంగ్రెస్‌పై సుఖ్‌బీర్ తీవ్ర ఆరోపణలు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ పైన పంజాబ్ ఉప ముఖ్యమంత్రి, అకాలీదల్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో అశాంతికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. తీవ్రవాదులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఘాటుగా మండిపడ్డారు.
జాతి వ్యతిరేక శక్తులకు నిధులు ఇస్తూ, వారిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉగ్రవాదులతో కలిసిన చరిత్ర ఆ పార్టీకి ఉందని తీవ్రంగా ఆరోపించారు. 1980లలో పంజాబ్‌లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. దాదాపు పదిహేనేళ్లు మిలిటెన్సీ ప్రబలి తీవ్ర అశాంతి, అలజడి చెలరేగిందన్నారు.

వందలమంది పంజాబీలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మత ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నారు. పంజాబ్ అల్లకల్లోలం అయిందన్నారు. అకాలీదల్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని శక్తులను ప్రోత్సహించిందన్నారు. ఆ శక్తులు అదుపు తప్పి పంజాబులో పదిహేనేళ్ల పాటు అశాంతిని సృష్టించాయన్నారు.
దేశ సమగ్రతకు భంగం వాటిల్లిందన్నారు. పంజాబులో నాటి అశాంతి వాతావరణాన్ని మరోసారి సృష్టించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఐఎస్ఐతో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలతో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిందన్నారు. ఆ పార్టీ ప్రస్తుతం తన అసలు రంగు బయటపెడుతూ దేశద్రోహ సంస్థగా వ్యవహరిస్తోందన్నారు.
మరోవైపు, సుఖ్ బీర్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. తమ చేతగానితనాన్ని ఇతర పార్టీలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications