నచ్చిన వారికి టికెట్ ఇచ్చుకోండి : సుమిత్రా మహజన్
ఢిల్లీ : సీనియర్లకు టికెట్లు ఇచ్చే విషయంలో బీజేపీ పొమ్మనలేక పొగబెడుతోంది. మొన్న ఎల్ కే అద్వానీ, నిన్న మురళీ మనోహర్ జోషికి టికెట్ ఇచ్చే అంశంపై మీనమేషాలు లెక్కించిన కమలదళం తాజాగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ విషయంలో ఇదే ధోరణి అవలంబిస్తోంది. పార్టీ వైఖరితో విసిగిపోయిన సుమిత్రా మహజన్ ఎన్నికల్లో పోటీచేయనని స్పష్టంచేశారు. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి లేఖ రాశారు.
బీజేపీ నేత సుమిత్రా మహజన్ ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంపై సుమిత్రా అసంతృప్తితో ఉన్నారు. ఇంతకాలం వేచిచూసే ధోరణి అవలంబించిన ఆమె ఇప్పుడు మౌనం వీడారు. టికెట్ కేటాయింపు విషయంలో నేతలు సందిగ్దంలో ఉన్నట్లు అనిపిస్తోందన్న ఆమె.. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధినాయకత్వం డైలమాను పక్కనబెట్టి ఇండోర్ అభ్యర్థి పేరు ప్రకటించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే 75ఏళ్లు పైబడిన నేతలకు టికెట్ ఇవ్వకూడదని బీజేపీ నిర్ణయించినట్లు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం ప్రకటించారు. సుమిత్రా మహజన్ ఈ నెల 12న 76వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వయసు కారణంగానే టికెట్ కేటాయింపు విషయంలో ఆలస్యం చేస్తున్నారని భావించిన సుమిత్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications